తల్లిదండ్రులకు చెప్పే ధైర్యంలేకనో.. చెబితే ఒప్పుకోరనో.. ఎంతో మంది యువత ప్రేమ పేరుతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రేమించేటప్పుడు చేసిన ధైర్యం.. పెళ్లి అంగీకారానికి పెద్దలతో మాట్లాడేటప్పుడు చేయలేకపోతున్నారు. ఒకవేళ ధైర్యం చేసినా.. తల్లిదండ్రులను ఒప్పించాల్సిందిపోయి.. వారు వద్దనగానే మనస్తాపానికి గురవుతున్నారు. క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
తాజాగా.. ఓ ప్రేమజంట వేర్వేరు చోట్ల ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం గుండాల్లో యువతి సుజాత ఉరేసుకుని బలవన్మరణం చెందగా.. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచేడులో యువకుడు కృష్ణ చెరువులో దూకి మరణించాడు.
స్థానికుల వల్ల ఇరు ఘటనల్లో సమాచారం అందుకున్న ఆ ప్రాంతాల పోలీసులు వారు ఆత్మహత్యకు పాల్పడిన చోటుకు వెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.