LOVER CHEATING: సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైన వారి స్నేహం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరి మధ్య మొదలైన ప్రేమ కొన్నాళ్లు సాఫీగా సాగినప్పటికీ పెళ్లి విషయం ప్రస్తావనకు రాగానే యువకుడు నిరాకరించాడు. తాను మోసపోయానన్న విషయాన్ని గ్రహించిన బాధిత యువతి గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమాయణం..
Instagram love: నగరంలోని పద్మారావునగర్‌కు చెందిన సుందర్.. మియాపూర్‌కు చెందిన వెన్నెల అనే యువతికి ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచమయ్యాడు. వాళ్ల మధ్య చిగురించిన స్నేహం అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇద్దరి మధ్య ప్రేమ చివరికి శారీరక సంబంధం వరకూ వచ్చింది. గోపాలపురం పీఎస్ పరిధిలోని ఓ ఇంటర్నేషనల్ హోటల్లో రెండ్రోజులుగా సుందర్, వెన్నెల కలిసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని బాధిత యువతి సుందర్‌ను కోరగా అతను పెళ్లికి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. తాను మోసపోయానని గ్రహించి.. మనోవేదనకు గురైన బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరుతో సుందర్ తనను శారీరకంగా వాడుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.