khammam brahmana bazar incident : ఖమ్మం బ్రాహ్మణ బజారులో చెట్టుకూలి ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటనలో ఖాళీ స్థలం యజమాని నిర్లక్ష్యం కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. షాపింగ్ మాల్‌కు లీజుకు ఇచ్చి రక్షణ చర్యలు మర్చిపోయారని ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితం స్థలం చదును చేశారని.. అప్పుడే చెట్టు కదిలి ప్రమాదకరంగా మారి ఉంటుందని తెలిపారు. పాత గోడలు, చెట్టు పరిస్థితిని గమనించి ఉంటే ఇద్దరు చిన్నారుల ప్రాణాలు నిలబడేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉండగా.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారని స్థానికులు తెలిపారు.
ఏం జరిగింది?
ఖమ్మంలోని బ్రాహ్మణ బజారులో విషాదం చోటు చేసుకుంది. ఓ ఖాళీ స్థలంలో చిన్నారులు ఆడుకుంటుండగా భారీ వృక్షం కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
మంచినీళ్ల కోసం వాళ్ల అమ్మను చాలాసార్లు పిలిచాడు. ఇక్కడ మంచినీళ్లు తాగాడు. ఎప్పుడూ గేట్ వేసే ఉండేది. నిన్న తీశారు. అయితే మళ్లీ గేట్ వేయలేదు. మా ఇంటి ముందు ఆడుకునే పిల్లలు ఖాళీ ప్లేస్ ఉందని ఇక్కడ ఆడుకున్నారు. అయితే వారం రోజుల క్రితం ఇక్కడ చదును చేశారు. అప్పుడే ఆ రావి చెట్టు కదిలి ఉంటుందని నా అభిప్రాయం. అందుకే ఎలాంటి గాలి, దుమ్ము లేకుండానే ఈ భారీ వృక్షం కూలిందని అనుకుంటున్నాను.
-స్థానికురాలు, బ్రాహ్మణ బజారు
గతంలో ఖమ్మం కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. కాలం చెల్లిన ఇళ్లను కొన్నింటిని కూలగొట్టింది. అయితే ఇది ఇల్లు కాదు. ఇక్కడ గడ్డి పెరిగింది. అయితే ఈ ఖాళీ ప్రదేశాన్ని షాపింగ్ మాల్ వాలెట్ పార్కింగ్‌కు అద్దెకి ఇచ్చాడు. రీసెంట్గా లీజుకు ఇచ్చారు. అయితే షాపింగ్ మాల్ వాళ్లు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు. ఖాళీ ప్లేస్ ఉందని పిల్లలు ఆడుకున్నారు. అనుకోని విధంగా ఆ చెట్టు కూలి... ఇద్దరు పిల్లలను బలిగొంది. ఆ సైట్ ఓనర్‌పై చర్యలు తీసుకోవాలి.
-స్థానికుడు, బ్రహ్మణ బజారు
ఎలా జరిగింది?
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం ఆరుగురు చిన్నారులు బ్రాహ్మణ బజారులోని ఖాళీస్థలంలో ఆడుకునేందుకు వెళ్లారు. ఈక్రమంలో అక్కడున్న ఓ చెట్టు కూలి పక్కనున్న గోడపై పడింది. దీంతో గోడ కిందపడి దిగాంత్ శెట్టి (11), రాజ్‌పుత్ ఆయుష్ (6) మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని మేయర్ నీరజ, ఏఈ నర్సయ్య, అగ్నిమాపక అధికారులు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: Farmers Suicide due to crop loss : పంట నష్టంతో మనస్తాపం.. ఇద్దరు మిర్చి రైతుల ఆత్మహత్య