Udaipur Kanhaiya Lal murder case : సంచలనం సృష్టించిన రాజస్థాన్ ఉదయ్‌పుర్ దారుణహత్య కేసులో హైదరాబాద్‌తో లింకులు మరోసారి బహిర్గతమయ్యాయి. టైలర్ కన్హయ్యలాల్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులతో సంబంధం ఉందనే ఆరోపణలతో ఇప్పటికే హైదరాబాద్ సంతోష్‌నగర్‌కు చెందిన మునావర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారించిన సంగతి తెలిసిందే. కన్హయ్యలాల్ హత్య కేసు నిందితులు గతంలో హైదరాబాద్ వచ్చి వెళ్లారని, నిందితుల ఫోన్‌లో మునావర్ నంబరు ఉండటంతోనే అతడికి ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసింది.
ఈ అంశం మరిచిపోకముందే హైదరాబాద్ సంతోష్‌నగర్‌లో మరొకరిని రాజస్థాన్ పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన అజ్మీర్ దర్గా ఖాదిమ్ గౌహర్‌ఖాన్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. కన్హయ్యలాల్ హత్య అనంతరం గౌహర్‌ఖాన్ హైదరాబాద్ వచ్చి మునావర్ వద్ద తల దాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపూర్‌శర్మను హత్య చేయాలంటూ గత నెల 17న విద్వేషపూరిత ప్రసంగం చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
అదే రోజు ఉయద్‌పుర్‌కు వచ్చిన గౌహర్‌ఖాన్.. కన్హయ్యలాల్ హత్య కేసు నిందితుల్లో ఒకరైన రియాజ్ అత్తారీని కలిసినట్లు అనుమానిస్తున్నారు. కన్హయ్యలాల్‌ను హత్య చేస్తున్నప్పుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయాలని అతడే చెప్పాడని ఆరోపణలున్నాయి. గత నెల 28న హత్య చోటు చేసుకోవడంతో గౌహర్‌ఖాన్ అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. కన్హయ్యలాల్ హత్య కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేసిన రాజస్థాన్ పోలీసులు తాజాగా హైదరాబాద్ నుంచి గౌహర్‌ఖాన్‌ను పట్టుకెళ్లారు.
ఇవీ చదవండి: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల కలకలం.. స్నేహితుల మధ్య గొడవే కారణం..