శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన ఓ మహిళా పీఎస్సై(Probationary SI) ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఏపీ విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలానికి చెందిన ఓ యువతి కొద్ది నెలల క్రితం ఎస్సైగా ఉద్యోగం పొందింది. ప్రస్తుతం ఆమె సత్యనారాయణపురంలో పీఎస్సై(Probationary SI)గా పనిచేస్తున్నారు. ఈనెల 12వ తేదీ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అయోధ్యనగర్‌లోని ఇంట్లో ఆత్మహత్యకు యత్నించింది. తాను చనిపోతున్నానని నగరంలోని సీసీఎస్(CCS)లో పనిచేసే ఓ ఎస్సైకు సమాచారం ఇచ్చింది.
వెంటనే ఆయన.. సత్యనారాయపురం సీఐ బాలమురళీకృష్ణకు తెలిపి, ఆమె ఇంటికి చేరుకున్నారు. అజిత్‌సింగ్‌నగర్, సత్యనారాయణపురం పోలీసులు అక్కడకు చేరుకుని ఇంటి తలుపులు పగలకొట్టగా... ఆమె కింద పడిపోయి ఉంది. పక్కన గోళ్ల రంగు, శానిటైజర్ సీసాలు ఉండటంతో.. వాటిని తాగి ఆత్మహత్యకు పాల్పడిఉండవచ్చనే అనుమానంతో సింగ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి(Private Hospital)కి తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆత్మహత్యకు యత్నించినందుకు సదరు మహిళా పీఎస్సైపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
మనస్తాపంతోనే..
మహిళా పీఎస్సై ఆత్మహత్య యత్నం ఘటనకు కారణం ప్రేమ వ్యవహారమని తెలుస్తోంది. ఎ.కొండూరుకు చెందిన ఓ ఎస్సైతో ఆమె ప్రేమలో ఉందని, ప్రస్తుతం అతను సీసీఎస్‌లో పనిచేస్తున్నాడని సమాచారం. అతను ఇటీవల ఈమెను కాదని వేరొక యువతిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపంతోనే పీఎస్సై ఆత్మహత్యకు యత్నించిందని సమాచారం.
మాచవరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు..
ఇదిలా ఉండగా.. ఆత్మహత్యకు యత్నించిన మహిళా పీఎస్సైపై వారం రోజుల క్రితం మాచవరం పోలీసులకు ఫిర్యాదు అందిందని సమాచారం. తన భర్తకు రాత్రి సమయంలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని, చరవాణిలో అనేక సందేశాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, తన భర్తను ఇబ్బందులు పెడుతోందని అనుమానం వ్యక్తం చేస్తూ సీసీఎస్‌లో పనిచేస్తున్న ఎస్సై భార్య పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా, విచారణ జరుగుతోందని తెలుస్తోంది.
తాజాగా.. మహిళా పీఎస్సై ఆత్మహత్యకు యత్నించడం, దీనికి కారణం ప్రేమ వ్యవహరమనే వదంతులు పోలీసుశాఖాపరంగానూ వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి, మహిళా పీఎస్సైతో పాటుగా సీసీఎస్ ఎస్సైపైనా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.