ఉపాధి కోసం నగరానికొచ్చి... వ్యసనాలకు అలవాటుపడి.. సులభంగా డబ్బుసంపాదించేందుకు వినూత్న మార్గం ఎంచుకుని.. లక్షలు కాజేసిన ఇద్దరిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా మరిపుడ మండలానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, కొండారెడ్డి సమీప బంధువులు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసి మానేశారు. వ్యసనాలకు అలవాటుపడిన శ్రీనివాస్ రెడ్డి, కొండా రెడ్డి.. షేక్ పేటలోని ఓ గది అద్దెకు తీసుకున్నారు. సులభంగా సొమ్ము సంపాదించేందుకు నూతన మార్గం ఎంచుకున్నారు.
కిరాణా దుకాణాల పేరుతో పేటీఎం నుంచి రెండు పీఓఎస్ మిషన్లు తీసుకున్నారు. ఏటీఎం కార్డులను పీఓఎస్ మిషన్లో స్వైప్ చేసి డబ్బులు తీసుకునే సౌలభ్యం ఉంది. ఏటీఎం కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించి... అక్కడ ఎవరైనా ఏటీఎం కార్డులను మర్చిపోతే వాటిని తీసుకునే వాళ్లు. ఆ ఏటీఎం కార్డుల ద్వారా స్వైప్ మిషన్ల సాయంతో డబ్బును తమ ఖాతాలకు మళ్లించుకునేవారు. స్వైప్ మిషన్ల ద్వారా ఎలాంటి పాస్ వర్డ్ లేకుండా గరిష్ఠంగా రోజులు 4 వేలు డ్రా చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని జనవరి నుంచి ఇప్పటి వరకు లక్షల్లో సొమ్ము కాజేశారు.
కార్డు పోగొట్టుకున్న వ్యక్తి అప్రమత్తమై తన ప్రమేయం లేకుండానే నగదు పోయినట్లు గుర్తించి బ్లాక్ చేయించగానే... నిందితులు ఆ కార్డులను గదిలో పడేసేవాళ్లు. గత ఆరు నెలల కాలంలో లక్షల్లో సొమ్ము కాజేసిన నిందితులపై కేసు నమోదు చేసుకొని నిఘా పెట్టిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
దొరికిన ఏటీఎం కార్డుల నుంచి నగదు డ్రాచేసుకుంటున్న ఇద్దరిని అరెస్టు చేశాము. వారి నుంచి రూ. 2.5లక్షల నగదు, 319 డెబిట్ కార్డులు, రెండు స్వైపింగ్ మెషీన్లు స్వాధీనం చేసుకున్నాం. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధి కోసం నగరానికొచ్చి.. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని... కిరాణా దుకాణాల పేరుతో పేటీఎం నుంచి రెండు స్వైపింగ్ మెషీన్లు తీసుకున్నారు. ద్విచక్రవాహనంపై ఏటీఎం కేంద్రాల వద్ద రెక్కీ నిర్వహిస్తూ ఎవరైనా ఏటీఎం కార్డు మరచిపోతే దానిని కాజేసి దాని నుంచి స్వైపింగ్ మెషీన్ ద్వారా డబ్బులు తమ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకునేవాళ్లు. పిన్ నంబర్ లేకుండా రూ.4వేల వరకు డ్రా చేసేవారు. పోయిన ఏటీఎం కార్డులు బ్లాక్ అయ్యే వరకు డబ్బులు తీసుకుంటూనే ఉండేవారు. ఏ1 నిందితుడు రూ.6.87 లక్షలు, ఏ2 రూ. 1.5 లక్షలు డ్రా చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. సజ్జనార్, సైబరాబాద్ సీపీ.
ఇదీ చూడండి: PD ACT: మాజీ రంజీ క్రికెటర్ నాగరాజుపై పీడీ యాక్ట్ నమోదు