కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ నగదు పక్కదారి పడుతోంది. సర్పంచ్, కార్యదర్శుల సంతకాలు, స్టాంపులను ఫోర్జరీ చేసి డబ్బులు కాజేశారని ఆసిఫాబాద్ మండలంలోని ఇంద్రానగర్ సర్పంచ్ దుర్గం రాజ్యలక్ష్మీ, రౌటసంకేపల్లి మాజీ సర్పంచ్ పోలీసులను ఆశ్రయించారు.
అక్రమంగా స్టాంప్‌ల తయారీ..
మండలంలోని రౌటసంకేపల్లి సర్పంచ్, కార్యదర్శి, రెబ్బెన మండలం ఇంద్రానగర్ సర్పంచ్, కార్యదర్శులు వాడే రబ్బర్ స్టాంప్‌లను కొందరు వ్యక్తులు అక్రమంగా తయారు చేస్తున్నారు. వీరి సంతకాలను ఫోర్జరీ చేసి కల్యాణలక్ష్మీ, పథకానికి వాడుకున్నారు. ఈ విధంగా ఈ రెండు పంచాయతీల్లో కలిపి దాదాపు 35 మంది కల్యాణలక్ష్మీ నగదు కోసం సంతకాలు ఫోర్జరీ చేసి నగదు కాజేశారని అధికారులు గుర్తించారు.
ఓ ప్రైవేటు వ్యక్తి అన్నీ తానై ..
లబ్ధిదారులు ఎవరైనా సరే వివాహ ధ్రువపత్రం కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావాల్సిందే. లబ్ధిదారులు కార్యాలయానికి రాగానే ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు వ్యక్తి అన్నీ తానై తరువాత తతంగమంతా నడిపిస్తున్నాడు. రూ.10 వేలు చేతిలో పెడితే ఆర్థిక సహాయం అందేలా చేస్తున్నాడు. కాగజ్‌నగర్‌తో పాటు మిగతా మండలాల్లో తన అనుచరులను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం అందించే ప్రోత్సాహక సహాయాన్ని వాటాల రూపంలో పక్కదారి పట్టిస్తున్నాడు.
గతేడాది రూ. 13 కోట్లు
కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకానికి రెండు లక్షలకు మించని వార్షికాదాయం ఉన్న కుటుంబాలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో పెళ్లికి ప్రభుత్వం రూ. లక్షా 116 అందిస్తుంది. ఇందుకు పెళ్లి పత్రిక, వధువు, తల్లి బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలతోపాటు, వివాహ ధ్రువపత్రం, ఆయా పంచాయతీ, వీఆర్వో లు జారీ చేసిన ధ్రువపత్రాలతో మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో గత ఏడాది 2,345 మంది దరఖాస్తు చేసుకోగా, 1,345 మందికి రూ.13.46 కోట్లు ప్రభుత్వం అందించింది.
ఇదీ చూడండి: ఫిబ్రవరి నుంచి పాఠశాలల పునః ప్రారంభం.. వారికి మాత్రమే!