Dead Body Found: నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని విరాట్‌నగర్ మెట్టు మహంకాళి పాదాల వద్ద లభ్యమైన తలకు సంబంధించిన మొండెం దొరికింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కమ్మగూడలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద శిరస్సు లేని మొండెం లభించింది. తలను గుర్తించిన నాటి నుంచి తీవ్రంగా గాలించగా.. మూడు రోజుల తర్వాత పోలీసులు మొండాన్ని కనిపెట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మొండెంను ఆస్పత్రికి తరలించారు. మొండెం ఉబ్బి దుర్వాసన వస్తుండటంతో.. మూడు రోజుల క్రితం ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి నిర్మాణం కొన్నాళ్లుగా నిలిచిపోయింది. దీంతో.. అక్కడ ఉన్న ఇటుకల మధ్య ఎవరికీ అనుమానం రాకుండా మొండెంను పెట్టారు. ఈ ఘాతుకాన్ని పాల్పడ్డ నిందితులను పట్టుకునేందుకు.. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఏం జరిగిందంటే..
సోమవారం(జనవరి 10) ఉదయం అమ్మవారి పాదాల వద్ద మొండెం లేని తల ఉండడాన్ని ఆలయ పూజారి గుర్తించారు. స్థానిక పెద్దలకు, పోలీసులకు సమాచారం అందించగా.. డీఎస్పీ ఆనంద్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. మృతుడిని గుర్తించే క్రమంలో తల ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పెట్టగా.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ గ్రామానికి చెందిన జహేందర్‌నాయక్ (30)గా గుర్తించారు.
గుప్త నిధుల కోసమేనా..?
జహేందర్‌నాయక్‌కు మతిస్థిమితం లేక ఐదేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని.. ఇబ్రహీంపట్నం మండలం తుర్కయంజాల్‌లో కొన్నాళ్లుగా బిక్షాటన చేసుకుంటున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా.. ఈ నెల 5వ తేదీ నుంచి జహేందర్ తుర్కయంజాల్‌లో కనిపించలేదని స్థానికులు తెలిపారు. జహేందర్ నాయక్‌ను నరబలి ఇచ్చుంటారని పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇదే జిల్లాలోని దేవరకొండ, నాంపల్లి, చింతపల్లి మండలాల్లో ఇలాంటి ఘటనలు జరగడంతో... పాత నేరస్థులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు తుర్కయంజాల్‌కు వెళ్లి జైహింద్‌నాయక్‌ను ఇంటికి రమ్మని బతిమాలగా.. రానని చెప్పినట్లు మృతుడి తండ్రి తెలిపాడు. గుప్త నిధుల కోసమే తన కుమారుడిని హత్య చేశారని ఆయన అనుమానించారు.
సంబంధిత కథనం..