హైదరాబాద్‌లోని హెటిరో డ్రగ్స్ గ్రూపు సంస్థలపై (Hetero Drugs Companies) ఆదాయపు పన్ను శాఖ దాడులు శుక్రవారం కూడా కొనసాగుతాయని ఐటీ అధికారులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా రెండు, మూడు ప్రాంతాల్లో ఐటీ బృందాలు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఆ సంస్థకు చెందిన సిబ్బందిపై వివిధ ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్లు ఐటీ అధికారులు వివరించారు. పట్టుబడిన నగదుకు సంబంధించిన వివరాలపై ఐటీ బృందాలు ఆరా తీస్తున్నాయి. గురువారం ఆ సంస్థకు చెంది వివిధ ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో భాగంగా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.
23 ప్రత్యేక బృందాలతో
సనత్‌నగర్‌లోని కార్పోరేట్ కార్యాలయంతోపాటు జీడిమెట్ల, ఇతర ప్రాంతాల్లోని ప్రొడెక్షన్ కేంద్రాలు, ఆ సంస్థ డైరెక్టర్లు, సీఈవో కార్యాలయాలు, ఇళ్లపై తనిఖీ చేస్తున్నాయి. 23 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు. సంస్థ చెల్లిస్తున్న ఆదాయపు పన్నుకు, అ సంస్థ వ్యాపార లాదేవీలకు వ్యత్యాసం ఉండడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సోదాలు పూర్తైన తర్వాతే వివరాలు
ఇప్పటికే ఆ సంస్థకు చెందిన పలు దస్త్రాలను, ఎలక్ట్రానిక్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగదు స్వాధీనం విషయమై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు విభాగం డీజీ వసుందర సిన్హా వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. సోదాలు పూర్తయ్యిన తరువాతనే వివరాలు చెప్పడానికి అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి: Hetero Drugs: హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఐటీ దాడులు.. రూ.100 కోట్లు స్వాధీనం