బెంగళూరు మత్తు మందు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రతన్ రెడ్డి, కలహార్ రెడ్డి సోమవారం కూడా విచారణకు హాజరు కాలేదు. ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరుకావాలని బెంగళూరు కమిషనరేట్ పరిధిలోని గోవిందపురం పోలీసులు ఇద్దరికి రెండో సారి నోటీసులు జారీ చేశారు.
రతన్ రెడ్డి మాత్రం మంగళవారం విచారణకు హాజరవుతానని తన లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. 6వ తేది ఇద్దరూ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మత్తు మందుల కేసులో గత 26వ తేదీన రతన్ రెడ్డి, కలహార్ రెడ్డికి గోవిందపురం పోలీసులు నోటీసులు ఇచ్చారు. 30న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నా... ఇద్దరూ స్పందించకపోవడంతో రెండో సారి నోటీసులిచ్చారు. రతన్ రెడ్డి, కలహార్ రెడ్డిని ప్రశ్నించిన తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు బెంగళూరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ఓ ఎమ్మెల్యే పేరును సందీప్ రెడ్డి ప్రస్తావించారు. సందీప్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగానే రతన్, కలహార్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన పోలీసులు వాళ్లిద్దరి నుంచి మిగతా వాళ్ల సమాచారం సేకరించాలని చూస్తున్నారు.
బెంగళూరు పోలీసులు సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు.. శంకర గౌడ ఇచ్చిన పార్టీల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సినీ రంగానికి చెందిన కొంత మంది కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. రతన్ రెడ్డి, కలహార్ రెడ్డిని ప్రశ్నించిన అనంతరం... వాళ్లు చెప్పే పేర్ల ఆధారంగా మిగతా వాళ్లకు బెంగళూరు పోలీసులు నోటీసులిచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: '400మంది నక్సల్స్.. బుల్లెట్ల వర్షం కురిపించారు '