Bank Manager Fraud: బ్యాంక్ ఆఫ్ బరోడా బోయిన్‌పల్లి శాఖలో సంతోష్ కుమార్ స్కేల్-2 మేనేజర్‌గా గతేడాది అక్టోబరు నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. బంగారంపై గరిష్ఠంగా 35 లక్షల రూపాయల రుణం ఇచ్చేందుకు సంతోష్‌కు అధికారం ఇంది. దీనినే అతను అవకాశంగా మలుచుకున్నాడు. బ్యాంకులో పొదుపు ఖాతాలున్న వారి వివరాలను సేకరించాడు. వారి లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించాడు. వారి పేర్లతో రుణం తీసుకున్నా అనుమానం రాదని తెలుసుకున్నాడు.
గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు తొమ్మిది పొదుపు ఖాతాల నుంచి విడతల వారీగా కోటి 62 లక్షల రుణం తీసుకున్నాడు. రుణం మంజూరుపై సంతోష్ సంతకం ఉండడంతో బంగారం ఉందా? లేదా? అని ఉన్నతాధికారులు గమనించలేదు. దీంతో పాటు రుణం ఇచ్చినప్పుడు ఉన్నతాధికారికి తెలపడంతో పాటు... తాను సంతకం చేసిన పత్రాలను ధ్రువీకరించేందుకు మరో అధికారికి చెందిన ఐడీలను వినియోగించుకున్నాడు. కిస్తీలు నాలుగైదు నెలల తర్వాత కడతారంటూ పొదుపు ఖాతాలు తీసుకున్న వారి తరఫున సంతోష్ చెప్పడంతో అధికారులకు ఎక్కడా అనుమానం రాలేదు.
ఇలా పక్కా ప్రణాళిక ప్రకారం రుణాలు తీసుకున్న మొత్తాన్ని సంతోష్.. తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి జమ చేశాడు. అటు నుంచి అటు తన డీమ్యాట్ ఖాతాలోకి జమచేసుకుని షేర్ల క్రయవిక్రయాలు కొనసాగించాడు. ఆర్థిక సంవత్సరం ముగింపు తనిఖీల్లో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ ఉన్నతాధికారులు, ఆడిట్ అధికారులు ఏప్రిల్ నెల చివరి వారంలో బోయిన్‌పల్లి శాఖకు వెళ్లడంతో బండారం బయటపడింది. నగదు నిల్వలు, స్వల్పకాలిక రుణాలు, బంగారంపై తీసుకున్న రుణాల లెక్కాపత్రాలను పరిశీలించారు. మూడు కిలోలకుపైగా బంగారు ఆభరణాలు కనిపించకపోవడాన్ని గుర్తించారు.
బంగారు నగలు, ఆభరణాలపై రుణాలు తీసుకున్నట్టు రసీదులు, పత్రాలూ ఉన్నా.. బ్యాంక్ ఖజనాలో బంగారు లేదు. దీనిపై చీఫ్ మేనేజర్‌ను ఉన్నతాధికారులు ప్రశ్నించగా... బంగారంపై రుణాలిచ్చే బాధ్యత సంతోష్ కుమార్‌దేనని చెప్పారు. సంతోష్‌ను ప్రశ్నించగా.. నీళ్లు నమలడంతో.. శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. దురుద్దేశపూర్వకంగా రుణాలు తీసుకున్నాడంటూ మేనేజర్ ఎంసీ నాగరాజు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంతోష్‌ను అరెస్ట్ చేశారు. ఆయన డీమ్యాట్ ఖాతాల వివరాలు సేకరించి కోటి 58లక్షల రూపాయలు స్తంభింపజేయాలంటూ సెబీకి లేఖ రాశారు. వారి అంగీకార ప్రత్యుత్తరాన్ని బ్యాంక్‌ఆఫ్ బరోడా అధికారులకు ఇచ్చారు.
ఇవీ చదవండి: