Scam in Adilabad DCCB: ఆదిలాబాద్ డీసీసీబీ బేల బ్రాంచిలో రూ.2 కోట్ల 86 లక్షల కుంభకోణం వ్యవహారంపై అధికారుల విచారణ కొనసాగుతోంది. స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేసిన శ్రీపతికుమార్ రూ.2 కోట్ల 86 లక్షల నిధులను గతేడాది సెప్టెంబర్ 13 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు విడతలవారీగా తన కుటుంబంలోని నలుగురు ఖాతాల్లోకి మళ్లించారు. ఇందుకు మేనేజర్ రాజేశ్వర్, అసిస్టెంట్ మేనేజర్ రణిత ఆమోదం తెలిపారు. అనంతరం శ్రీపతి కుమార్ తన కుటుంబసభ్యుల ఖాతాల్లోంచి... జన్నారం బ్రాంచిలో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బండి రమేష్ ఖాతాలోకి రూ.కోటి 30 లక్షలు పంపించినట్లు అధికారుల విచారణలో తేలింది.
పలు ఖాతాల్లోకి నగదు జమ
ఆదిలాబాద్ డీసీసీబీలో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేసిన నితిన్ ఖాతాలో రూ.10 లక్షల 49 వేలు, బేలలో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేసిన రాహుల్ ఖాతాలోకి రూ.4.50 లక్షలు, భీంపూర్ బ్రాంచి అటెండర్ రమేష్ ఖాతాలోకి రూ.3 లక్షలు, ఆదిలాబాద్ రూరల్ బ్రాంచి మేనేజర్ సవిత ఖాతాలోకి రూ.2 లక్షలు వేసినట్లు నిర్ధరణైంది. బండి రమేష్ ఖాతాలోకి వచ్చిన మొత్తంలో జన్నారం మేనేజర్ వేణుగోపాల్ ఖాతాలోకి రూ.3.40 లక్షలు, స్టాఫ్ అసిస్టెంట్ ప్రవీణ్ ఖాతాలోకి రూ.2.50 లక్షలు, ఆదిలాబాద్ ప్రధాన కార్యాలయంలోని మేనేజర్ ప్రవీణ్‌రెడ్డి ఖాతాలోకి రూ.2.50 లక్షలు పంపించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారమంతా బేల బ్రాంచిలో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేసిన శ్రీపతికుమార్.... జన్నారం బ్రాంచిలో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బండి రమేష్ మధ్య అవగాహనతోనే జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
"ఇప్పటివరకు సుమారు రూ.51 లక్షల రూపాయల వరకు ఉద్యోగులకు సంబంధించిన ఖాతాలను స్తంభింపజేశాం. ప్రధాన సూత్రధారి శ్రీపతి కుమార్‌గా కేసు నమోదైంది. 17 ఖాతాలకు నగదును అక్రమంగా జమ చేసిన అధికారులు కూడా ఇందులో దోషులే." -శ్రీధర్‌రెడ్డి, ఆదిలాబాద్ డీసీసీబీ సీఈవో
ఇదీ చదవండి : డీసీసీబీలో రూ.2.86 కోట్ల కుంభకోణం.. 4మేనేజర్లు సహా 11 మంది ఉద్యోగులపై వేటు
"దోషులు ఎవరైనా సరే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అక్రమంగా బదిలీ అయిన నగదును కూడా రికవరీ చేస్తాం. నిందితులను వదిలే ప్రసక్తే లేదు." - భోజారెడ్డి, ఆదిలాబాద్ డీసీసీబీ ఛైర్మన్
కుంభకోణం వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. వీటన్నింటిపైనా సమగ్ర విచారణ చేస్తున్న అధికారులు... నిందితులను తప్పకుండా శిక్షిస్తామని చెబుతున్నారు. ప్రాథమిక సమాచారంతో కూడిన అంశాలను ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డికి నివేదించిన డీసీసీబీ ఉన్నతాధికారులు.. సీఐడీకి అప్పగించే నివేదిక కోసం సమగ్ర విచారణ కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: మరోసారి నవ్వులు పూయించిన మంత్రి మల్లారెడ్డి.. సభలో తనదైన శైలిలో ప్రసంగం