International prostitution Gang: అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టును రాచకొండ ఎస్వోటీ, ఉప్పల్, మనుషుల అక్రమరవాణా నిరోధక విభాగం పోలీసులు రట్టు చేశారు. ముఠా ఉచ్చు నుంచి బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు యువతులను పోలీసులు రక్షించారు. బంగ్లాదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్‌కు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. జార్ఖండ్‌కు చెందిన సతీశ్ రజాక్, బ్రిష్టి కాటూన్, దీపక్ చంద్, సురేశ్, అస్లాం, అరుణ్ కలిసి ముఠాగా ఏర్పడి బంగ్లాదేశ్ నుంచి యువతులను అక్రమంగా తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఓ యువతితో పాటు ఆమె సోదరి అయిన మైనర్ బాలికను తీసుకువచ్చిన ముఠా.. వ్యభిచార రొంపిలో దించారు. ఈ క్రమంలో యువతి తన సోదరిని ఎందుకు తీసుకువచ్చారని నిర్వాహకులతో గొడవ పడింది. ఎలాగైనా ఈ ఉచ్చు నుంచి బయటపడాలని నిర్ణయించుకున్న అక్కాచెల్లెల్లు.. నిర్వాహకుల కళ్లుగప్పి చాకచక్యంగా తప్పించుకున్నారు. వీళ్లిద్దరు ఉప్పల్ ప్రాంతంలో ఆరునెలల చిన్నారిని పట్టుకుని ఏడుస్తూ కనిపించటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిని సురక్షిత ప్రాంతానికి తరలించి విచారించగా.. అసలు విషయం బయటపడింది. వారి నుంచి పూర్తి సమాచారం సేకరించి... వ్యభిచార కూపంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. నిందితుల నుంచి ఏడు చరవాణులు, కారు స్వాధీనం చేసుకున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ హెచ్చరించారు.
"జులై 11న ఉప్పల్ ప్రాంతంలో ఆరునెలల చిన్నారిని పట్టుకుని ఒక మహిళ, ఓ మైనర్ బాలిక ఏడుస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు.. సమాచారం సేకరించగా.. వాళ్లు బంగ్లాదేశీయులని తెలిసింది. వ్యభిచారం కోసం తనను హైదరాబాద్‌కు తీసుకొచ్చారని.. అక్కడితో ఆగకుండా తన చెల్లిని కూడా తీసుకొచ్చారని ఆ యువతి తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకుని.. దాడి చేసి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశాం. ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారు." - మహేష్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్
ఇవీ చూడండి: