పదేళ్ల కిందట అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మహానగరంలోని అనేక ప్రాంతాల్లో రాజీవ్‌గృహకల్ప (Rajiv Gruhakalpa) పేరుతో పేదల కోసం వేలాది ఇళ్లను అపార్టుమెంట్ల రూపంలో నిర్మించింది. అప్పట్లో ఈ రాజీవ్‌గృహకల్ప కాలనీ (Rajiv Gruhakalpa Colony)లు నగర శివార్లలో ఉండగా ఇప్పుడు వాటి చుట్టుపక్కల పెద్దఎత్తున అభివృద్ధి జరిగింది. దీంతో ఆ ఇళ్లకు భారీ డిమాండ్ పెరిగింది.
అయిదారేళ్ల కిందట రూ.ఆరేడు లక్షలకు వీటిని విక్రయించగా ఇప్పుడు ఒక్కో ఇంటికి రూ.10 లక్షలకు పైనే ధర పలుకుతోంది. సుభాష్‌నగర్ డివిజన్ సురారంకాలనీలో 134 బ్లాక్‌లలో రాజీవ్‌గృహకల్ప కాలనీ రూపుదిద్దుకుంది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి 2011 జూన్‌లో వీటిని ప్రారంభించారు. మొత్తం 4,302 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నిబంధనల ప్రకారం ఎవరికి కేటాయించిన ఫ్లాట్‌లో వారు మాత్రమే ఉండాలి. ఇతరులకు విక్రయించినా అది చెల్లదు. కానీ కొందరు బాండ్‌పేపర్ (Bond Paper) మీదే ఒప్పందం చేసుకొని క్రయ విక్రయాలను కొనసాగిస్తున్నారు. దీని కోసం స్థానిక నాయకులు మధ్యవర్తిత్వం చేస్తూ కమీషన్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది ఒక సూరారం కాలనీలోనే కాకుండా మహానగరంలో చందానగర్, ముషీరాబాద్, అన్నోజిగూడ, కౌకూర్, బండ్లగూడ, పోచారం, జవహర్‌నగర్, సూరారంకాలనీ, నిజాంపేట, జగద్గిరిగుట్టతోపాటు దాదాపు 30 చోట్ల రాజీవ్‌గృహకల్ప ఫ్లాట్లు నిర్మించగా చాలా వరకు క్రయవిక్రయాలు జరిగిపోయాయి.
ఇష్టారాజ్యంగా..
గృహకల్పలో ఇలా అక్రమంగా ఫ్లాట్లను కొనుగోలు చేసిన అనేకమంది స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఇళ్లు చిన్నవిగా ఉండటంతో ముందు భాగంలో రోడ్డు కోసంగానీ వెనుక భాగంలో సెట్‌బ్యాక్ కోసం వదిలిన స్థలంలోగానీ పిల్లర్లు వేసి విస్తరణ మొదలుపెడుతున్నారు. ఈ కాలనీలు నిర్మించినపుడు అధికారులు భవనం ముందు భాగంలో వెడల్పైన రోడ్డు వెనుక భాగంలో అగ్నిమాపక శకటం తిరిగేందుకు వీలుగా సెట్‌బ్యాక్ (Setback)ను వదిలారు. ఇప్పుడు ఒకవైపు ఉన్న రోడ్డు, వెనుక వైపు ఉన్న సెట్‌బ్యాక్ స్థలంలో కూడా ఫ్లాట్ల విస్తరణ జరిగిపోతుండటంతో కాలనీల్లోకి సాధారణ వాహనం కూడా భవిష్యత్తులో వెళ్లడం కష్టంగా మారే అవకాశం ఉంది.
జగద్గిరిగుట్టలో కట్టడాలపై కోర్టుకు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలో రాజీవ్‌గృహకల్పలో 52 బ్లాక్‌లలో 1779 ఫ్లాట్‌లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఎలాంటి అదనపు నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఇక్కడ కూడా ఫ్లాట్లకు ఆనుకొని అదనంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఓ వ్యక్తి గతేడాది సెప్టెంబర్‌లో కోర్టును ఆశ్రయించాడు. అక్కడి పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, హౌసింగ్ బోర్డు అధికారులను ఆదేశించింది.
ఇదీ చూడండి: రాజీవ్ గృహకల్ప సముదాయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత