హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన హత్య కేసు చిక్కుముడి వీడింది. ఈ కేసులో పలాస్ పాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతుడి వివరాలను నిందితుని నుంచి రాబట్టాల్సి ఉందని పేర్కొన్నారు. బోరబండలోని ఇందిరానగర్ ఫేజ్ 2 సాయిబాబా మందిరంలోని సెల్లార్‌లో ఉన్న ఫర్నిచర్ దుకాణంలోని పాత సామానుల మధ్యన పడి ఉన్న డబ్బాలో కుళ్లిపోయిన మృతదేహం బుధవారం వెలుగు చూసింది. ఈ సెల్లార్‌ను పలాస్ పాల్ అనే వ్యక్తి గత 2017నుంచి అద్దెకు తీసుకుని ఫర్నిచర్ షాపు నిర్వహిస్తున్నాడు.
గత 2 సంవత్సరాలుగా అద్దె చెల్లించని పలాస్ పాల్... 10నెలలు నుంచి ఆ ఫర్నిచర్ దుకాణాన్ని తెరవకుండా ఉంచాడు. అద్దె చెల్లించకపోవడంతో సాయిబాబా మందిరం నిర్వాహకులు సెల్లార్ దుకాణం తాళం పగులగొట్టి లోపలికి వెళ్లగా చెక్క డబ్బా నుంచి కుళ్లిన వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చెక్క డబ్బా తెరిచి చూడగా గుర్తు తెలియని వ్యక్తి అస్థిపంజరం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు... వేగంగా దర్యాప్తు జరిగి ఫర్నిచర్ షాపు నిర్వాహకులు పలాస్ పాల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- ఇదీ చూడండి: అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం