కేరళ కోజికోడ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో విషాదం చోటుచేసుకుంది. బాయ్స్ హాస్టల్ భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన చెన్నుపాటి వెంకట నాగేశ్వరరావు, భారతి దంపతుల కుమారుడు యశ్వంత్. అయితే యశ్వంత్ ఎన్‌ఐటీ కోజికోడ్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలోని హాస్టల్ తొమ్మిదో అంతస్తులో ఉండేవాడు. ఏం జరిగిందో తెలియదు.. ఆకస్మాత్తుగా మూడో అంతస్తు నుంచి దూకేసినట్లు అక్కడి యాజమాన్యం తెలిపింది. వెంటనే యశ్వంత్‌ను కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇదిలా ఉంటే... ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు... విద్యార్థి రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని చెబుతున్నారు. ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బు పోగొట్టుకోవడంతో ఆందోళనకు గురయ్యాడని బాధితుడి స్నేహితులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తన కుమారుడిది ఆత్మహత్య కాదని.. హత్యగా అనుమానిస్తున్నట్లు బాలుడి తండ్రి ఆరోపిస్తున్నారు. ఆ సూసైడ్ నోట్ తన కుమారుడిది కాదని తెలిపారు. దీంతో ఈ కేసును దర్యాప్తు పక్కాగా సాగేలా చూడాలంటూ నాగేశ్వరరావు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి... ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ ట్విటర్ ద్వారా కేరళ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కోరారు.
ఇవీ చూడండి: