ఇప్పటి జనరేషన్ అంతా సోషల్ మీడియాలోనే మునిగిపోతున్నారు. బోర్ కొడితే ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ట్విటర్... ఏదైతే ఏముంది.. సమయం తెలియకుండా గడిచిపోతుంది. అయితే ఈ టెక్నాలజీ పెరిగాక పక్కోడిని మోసం చేయడం చాలా ఈజీ అయిపోయింది. ముఖ్యంగా యువత.. ఈజీగా మోసపోతున్నారు. అమ్మాయిలే లక్ష్యంగా కొంత మంది కేటుగాళ్లు... ఫేక్ అకౌంట్స్‌తో వాళ్లను నమ్మించి.. కోట్లలో మోసం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ అడ్డాగా ఓ కేటుగాడు.. ఏకంగా 60 మంది అమ్మాయిలను మోసం చేసి.. రూ.4 కోట్లకు పైగా లూటీ చేశాడు.
ఇదీ జరిగింది... ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అమ్మాయిలకు వల వేస్తూ.. 60 మంది నుంచి రూ.4కోట్లు వసూలు చేశాడు ఓ యువకుడు. బాధితుల ఫిర్యాదుతో ఆ యువకుడిని హైదారబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన వంశీకృష్ణ బీటెక్ పూర్తి చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. తాను హైప్రొఫైల్ వ్యక్తినంటూ.. తప్పుడు సమాచారంతో అతివలను బోల్తా కొట్టించాడు. అలా 60 మంది అమ్మాయిలను మోసం చేసి... 4 కోట్ల రూపాయలను దోచుకున్నాడు. లక్షలు మోసపోయిన అమెరికాలో ఉండే హైదరాబాద్‌కు చెందిన ఓ బాధిత యువతి... సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఈ హైటెక్ బాబును అరెస్టు చేశారు. వంశీకృష్ణపై గతంలో రాచకొండ, ఉభయ గోదావరి, కాకినాడ, గద్వాల, నిజామాబాద్, ఖమ్మం, భీమవరం, విశాఖపట్నం, కరీంనగర్, విజయవాడలో ఈ తరహా పలు కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల కలకలం.. స్నేహితుల మధ్య గొడవే కారణం..