నకిలీ బ్యాంకు పూచీకత్తు పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును బట్టబయలు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన బయో మైనింగ్ కాంట్రాక్టును హర్షిత ఇన్‌ఫ్రా దక్కించుకుంది. దీని కోసం సెక్యూరిటీగా రూ.రెండున్నర కోట్లకు బ్యాంకు పూచీకత్తు అవసరమైంది. దీంతో హర్షిత ఇన్‌ఫ్రా సంస్థ ప్రతినిధులు ప్రజ్వల్, సందీప్‌రెడ్డి.. వరంగల్‌కు చెందిన న్యాయవాది అయిన లోన్ ఏజెంట్ నాగరాజును సంప్రదించి, సహకరించమని కోరారు. ఇందుకోసం రూ.47 లక్షల కమీషన్ ఇచ్చారు. నగరంలో స్థిరపడిన రాజస్థాన్‌కు చెందిన నరేష్ శర్మ ద్వారా కోల్‌కతాలోని నిలోత్పల్‌దాస్, సుబ్రజిత్ ఘోషాల్‌ను నాగరాజు సంప్రదించాడు.
Harshita Infra Has Bagged Bio Mining Contract: గుత్తేదారు సంస్థకు అవసరమైన సెక్యూరిటీ మొత్తంలో 4 శాతం కమీషన్ ఇచ్చి కోల్‌కతా, పార్క్‌స్ట్రీట్ ఇండస్‌ఇండ్ బ్యాంకు శాఖ పేరుతో రూ.3 కోట్ల 25 లక్షల విలువైన 12 నకిలీ పూచీకత్తు పత్రాలు సేకరించాడు. కోల్‌కతాలోని వ్యక్తుల వద్ద నాగరాజు సహకారంతో సంపాదించిన సెక్యూరిటీ పత్రాలను హర్షిత ఇన్‌ఫ్రా ప్రతినిధులు కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు అందజేశారు.
లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండటంతో ఆ పత్రాలను ఇండస్‌ఇండ్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి 'ఈ-మెయిల్' చేయగా నకిలీవని తేలింది. దీంతో మాసబ్‌ట్యాంకులోని ఇండస్‌ఇండ్ బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.45 కోట్ల విలువైన 60 నకిలీ పూచీకత్తు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
నిలోత్పల్ దాస్, సుబ్రజిత్ ఘోషాల్ కలిసి వివిధ బ్యాంకుల పేరిట రూ.100 కోట్ల మేర నకిలీ పూచీకత్తు పత్రాలు తయారు చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పథకంలో హర్షిత్ ఇన్‌ఫ్రా సంస్థ ఇప్పటికే 40 శాతం పనులు పూర్తి చేసింది. పలుచోట్ల నకిలీ పూచీకత్తు పత్రాలు దాఖలు చేసినట్లు తేలడంతో నల్గొండ జిల్లాలోని నందికొండ, హుజూర్‌నగర్, దేవరకొండ, నేరేడుచర్ల, నల్గొండ, చిట్యాల పురపాలికల్లో ఈ సంస్థ కాంట్రాక్టులను ప్రభుత్వం రద్దు చేసింది.
ఇవీ చదవండి: