రంగారెడ్డి జిల్లా దాసర్లపల్లికి చెందిన ఎర్గమెని మహేందర్‌కు అదే మండలంలోని మీర్‌ఖాన్‌పేటకు చెందిన సారమ్మ(33)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు జశ్వంత్(13), కుమార్తె తేజ(10) ఉన్నారు. కొన్నాళ్లు సంసారం బాగానే సాగినా.. ఇటీవల మహేందర్ మద్యానికి బానిసై పనులకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం మహేందర్ మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. గమనించిన సరమ్మ భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లి కాపాడుకుంది.
బైక్‌పై పరారై..
ఆ తర్వాత కూడా అతడిలో మార్పు రాలేదు. శనివారం రాత్రి మద్యం తాగి వచ్చిన మహేందర్ సరమ్మతో గొడవపడ్డాడు. ఆ తర్వాత అందరూ నిద్రిస్తుండగా భార్య పక్కన ఉన్న కుమార్తెను, కుమారుడిని మరో గదిలో పడుకోబెట్టాడు. అనంతరం గొడ్డలితో సరమ్మ మెడపై నరికాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న తల్లి కేకలతో పిల్లలు మేల్కొనగా.. బయటకు వస్తే చంపేస్తానని వారిని బెదిరించి ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. భయభ్రాంతులకు గురైన పిల్లలు నానమ్మ, పెద్దనాన్న ఇళ్లకు పరుగులు తీసి విషయం చెప్పారు.
పొదల్లో నక్కి..
వాహనంపై పరారైన మహేందర్ గ్రామానికి సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రం వద్ద దాన్ని వదిలేశాడు. ద్విచక్రవాహనాన్ని గుర్తించిన గ్రామస్థులు పరిసర ప్రాంతాల్లో వెతకగా.. కిలో మీటరు దూరంలో ఓ మామిడి తోట సమీపంలోని పొదల్లో కనిపించాడు. గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి: రాత్రి వేళలో కత్తులతో విచక్షణారహిత దాడి.. వ్యక్తి మృతి