Hospital negligence Child died: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న వారి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఆరు నెలల గర్భిణి స్త్రీ ఆసుపత్రికి వస్తే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసికందు మృతి చెందిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ ప్రాంతంలో జరిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సురేష్ మౌనిక దంపతులు కొండాపూర్లో నివాసం ఉంటున్నారు. మౌనిక నిండుగర్భిణి. ఈనెల 26న రాత్రి కడుపులో నొప్పి రావడంతో దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించారు. అయితే రాత్రి నొప్పులు రావడంతో డాక్టర్లు అందుబాటులో లేరని సిబ్బంది చికిత్స చేశారు. వీడియో కాల్ ద్వారా డాక్టర్ అక్కడ ఉన్న వైద్య సిబ్బందికి సూచనలు ఇవ్వడంతో వారు చికిత్స చేశారు.
నెలలు నిండకుండానే గర్బణీ ప్రసవించడంతో శిశువు మరణించడం జరిగింది. దీంతో ఆ పసికందును అక్కడి నుంచి తీసుకొచ్చి ఖననం చేశారు. వీడియో కాల్లో చికిత్స చేయడం వల్లే శిశువు చనిపోయిందని.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణంగా భావించి బాధితురాలి భర్త మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రెండు రోజుల క్రితం పూడ్చి పెట్టిన చిన్నారిని శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గర్భిణీ మౌనికకు గ్యాస్ ట్రబుల్ రావడంతో అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స అందించడం జరిగిందని వైద్యులు తెలిపారు. ఆ సమయంలోనే నొప్పులు రావడంతో వైద్యులు అందుబాటులో లేక వీడియో కాల్ ద్వారా నర్సుకు సూచనలు చేశామని చెబుతున్నారు. ఇక్కడ డెలివరీ సౌకర్యం లేకపోవడంతో మరో ఆసుపత్రి తరలించాలనుకున్నామన్నారు. కానీ ఇంతలోనే చిన్నారి మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: