ఓ సొసైటీ సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్న విశ్రాంత డీసీపీకి హైకోర్టు హైకోర్టు వినూత్న శిక్ష ఖరారు చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న అభియోగంపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సామాజిక సేవ చేయాలంటూ ఆదేశించింది. ముషీరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో మూడు నెలలు ఉచిత భోజనం అందించాలని విశ్రాంత అదనపు డీసీపీ జోగయ్యకు తెలిపింది. ప్రతి శని, ఆదివారాల్లో ఆశ్రమానికి వెళ్లి వృద్ధులతో గడపాలని హైకోర్టు స్పష్టం చేసింది.
గతంలో జోగయ్య నారాయణగూడ ఇన్స్పెక్టర్గా పని చేసినప్పుడు సెయింట్ జోసెఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ల మధ్య వివాదంలో జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సొసైటీ సివిల్ వివాదంలో జోక్యం చేసుకోవద్దని అప్పట్లోనే ఆయనకు హైకోర్టు హెచ్చరించింది. హైకోర్టు ఆదేశించినా జోగయ్య మాత్రం జోక్యం చేసుకుంటున్నారని ఆ సొసైటీ డైరెక్టర్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జోగయ్యకు రూ.5 వేల రూపాయల జరిమానా విధించారు. సింగిల్ జడ్జి ఆదేశాలపై జోగయ్య దాఖలు చేసిన అప్పీల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. జోగయ్య ఉద్యోగ విరమణ చేశారని.. గతంలోనూ ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించలేదని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఉద్యోగ విరమణ చేసినంత మాత్రాన చేసిన తప్పు మాఫీ కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వృద్ధాశ్రమంలో సేవ చేసేందుకు జోగయ్య అంగీకరించడంతో.. కోర్టు ధిక్కరణ కేసును కొట్టివేసింది. జోగయ్య చేసిన సేవలపై నివేదిక సమర్పించాలని వృద్ధాశ్రమ నిర్వాహకులను హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి: Sujana Chowdary : అమెరికా వెళ్లేందుకు సుజనాచౌదరికి హైకోర్టు అనుమతి