Headless corpse: రంగారెడ్డి జిల్లా బొంగులూరు వద్ద తల లేని మృతదేహం లభ్యమైంది. ఔటర్ రింగ్‌రోడ్ సర్వీస్ రోడ్ పక్కన మృతదేహాన్ని కనుగొన్నారు. హత్య చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో... మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. మృతుడు నల్గొండ జిల్లా వద్దిపట్ల వాసి నామా శ్రీనివాస్(42) గా గుర్తించారు.
ఇదీ జరిగింది
సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు ఆభరణాల క్రయవిక్రయాల్లో మోసాలకు పాల్పడిన కేసులో డిసెంబర్ 3న లొంగిపోయిన బ్రహ్మచారిని పోలీసులు విచారించారు. విచారణలో తాను శ్రీనివాస్ అనే వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఈ విషయమై సరూర్‌నగర్ పోలీసులు ఆదిబట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ మేరకు ఇబ్రహీంపట్నం తహసీల్దారు అనిత, ఏసీపీ బాలకృష్ణారెడ్డి, సీఐ నరేందర్, మృతుడి కుటుంబ సభ్యుల సమక్షంలో అటవీ ప్రాంతంలో శవాన్ని పాతిపెట్టిన చోట తవ్వి చూడగా.. తల లేని కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం లభించింది. ఆ సమీపంలో ఓ పార, 2 గంపలు, ఒక వైరు దొరికింది. అయితే తల ఆచూకీ మాత్రం లభించలేదు.
విచారణలో ఏమి చెప్పాడంటే..
పోలీసుల అదుపులో ఉన్న బ్రహ్మచారి.. శ్రీనివాస్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడు చెప్పినదానిని బట్టి నవంబర్14న కనిపించకుండా పోయిన శ్రీనివాస్ హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ హత్యపై మృతుడి కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూ వివాదాలు, వివాహేతర సంబంధాలే హత్యకు కారణమని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. శ్రీనివాస్‌ను హత్య చేసిన ముగ్గురిలో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిలో ఒకరు ట్రాన్స్ జెండర్ రాజమ్మ అలియాస్ రాజు, నరేష్ ఉన్నారు. మృతుడి భార్య కవిత 2006లో మృతి చెందగా 17 ఏళ్ల కుమారుడు గోపి కృష్ణ ఉన్నాడు. మృతుడు బెంగళూరు సమీపంలోని మెట్రో సిటీలో నివాసం ఉంటున్నాడు. అతడి స్వస్థలం నల్గొండ జిల్లా పెద్దడిచర్ల మండలం వదిపట్ల. పరారీలో ఉన్న ఇద్దరిని అరెస్టు చేస్తే తల ఎక్కడ ఉందని తెలుస్తుందని ఇబ్రహీంపట్నం బాలకృష్ణ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: Woman Murder: సహజీవనం చేసి.. సజీవ దహనం చేసిన ప్రియుడు