Head Found With Out Body: మతి స్థిమితంలేని ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసి, తల తెగ్గోసి తెచ్చి మహంకాళీ అమ్మవారి పాదాల ఎదుట పడేసిన ఉదంతం నల్గొండ జిల్లాలో కలకలం సృషించింది. గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారా? మరేదైనా జరిగిందా? అనేది తేలాల్సి ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం విరాట్‌నగర్ కాలనీ నాగార్జునసాగర్-హైదరాబాద్ జాతీయ రహదారి వెంట ఉంది. రహదారి పక్కనే మెట్టు మహంకాళీ అమ్మవారి విగ్రహం ఉంది. సోమవారం ఉదయం అమ్మవారి పాదాల వద్ద మొండెం లేని తల ఉండడాన్ని ఆలయ పూజారి బ్రహ్మచారి గుర్తించారు. స్థానిక పెద్దలకు, పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ ఆనంద్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. మృతుడిని గుర్తించే క్రమంలో తల ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. పలువురి సమాచారం ఆధారంగా మృతుడు జహేందర్‌నాయక్ (30) అని, అతడిది సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ గ్రామమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
గుప్తనిధుల కోసమే కడతేర్చారా?
ఈ హత్య నరబలేననే అనుమానాలను పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఇదే జిల్లాలోని శాలిగౌరారం, నాంపల్లి మండలం ముష్టిపల్లి, దేవరకొండ గుట్టల్లో గుప్త నిధుల కోసం నరబలి ఘటనలు జరిగిన నేపథ్యంలో పాత నేరస్థుల గురించి ఆరా తీస్తున్నారు. ‘మృతుడు జహేందర్‌నాయక్‌కు మతిస్థిమితం లేదు. ఐదారేళ్లుగా ఇంటికి దూరంగా ఉంటున్నాడు. కొన్నాళ్లుగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని తుర్కయాంజాల్ వద్దనున్న ఓ ఆలయం వద్ద ఉంటూ.. చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తుండేవాడు. అతడిని ఎవరు? ఎందుకు చంపారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. కేసు మిస్టరీని ఛేదించేందుకు ఎనిమిది బృందాలను నియమించాం’ అని డీఎస్పీ ఆనంద్‌రెడ్డి వెల్లడించారు. తల భాగాన్ని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు, వెంట్రుకలు, చర్మాన్ని డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపినట్టు వెల్లడించారు.
ఎక్కడో చంపి ఇక్కడ పారేశారా?
తల ఉన్నచోట రక్తపు ఆనవాళ్లు లేకపోవడం, తలకు గడ్డి, మట్టి అతుక్కుని ఉన్న నేపథ్యంలో ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారనే నిర్ధారణకు పోలీసులు వచ్చినట్టు తెలిసింది. మరోవైపు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించాయి. డాగ్ స్క్వాడ్ విరాట్‌నగర్ కాలనీ నుంచి ఒకటిన్నర కి.మీ.దూరంలో ఉన్న కుర్మేడ్ గ్రామంలో సంచరించి పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి వెళ్లి కొద్దిసేపు అక్కడే సంచరించింది. మరోవైపు నల్గొండ సీసీఎస్ డీఎస్పీ మొగులయ్య పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైల బృందం నిందితులను గుర్తించే క్రమంలో సీసీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను సేకరిస్తోంది.
ఇదీ చూడండి: Govt Teacher Suicide: ఉపాధ్యాయురాలు ఆత్మహత్య...బదిలీయే కారణమా?