నెట్‌బ్యాంకింగ్ అంతర్జాల ఆధారిత క్రయవిక్రయాలు... సేవల పేరుతో బాధితులను మోసం చేయవచ్చంటూ సైబర్ నేరస్థులు రోజుకో కొత్త పంథాలో మోసాలు చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల నవీకరణ, ఆధార్ అనుసంధానం, సిమ్‌కార్డు రీఛార్జీ, కేవైసీ అప్‌డేట్, కస్టమర్ కేర్ నంబర్ల పేరుతో సైబర్ నేరస్థులు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. బాధితుల ఆన్‌లైన్ ఖాతాలు, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి ఈ-వ్యాలెట్‌ల ఓటీపీ నంబర్లు, యూపీఐ నంబర్లు తెలుసుకుని లక్షల నగదు బదిలీ చేయించుకుంటున్నారు. బాధితుల నుంచి కాజేసిన డిజిటల్ నగదును నిమిషాల వ్యవధిలో విత్‌డ్రా చేసుకుంటున్నారు. సైబర్ మోసగాళ్ల వలలో పడి డబ్బు పోగొట్టుకున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. విచారణలో భాగంగా పోలీసులు సైబర్ నేరస్థుల ఫోన్ నంబర్లు, బ్యాంక్ ఖాతాలను సేకరించి వారిని పట్టుకునేందుకు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసినా వారి వద్ద బాధితుల నుంచి కాజేసిన సొమ్మును రికవరీ చేయటం కష్టంగా మారింది. దీంతో పోలీసులు నిందితులు వినియోగిస్తున్న చరవాణులను స్వాధీనం చేసుకుని జైళ్లకు పంపుతున్నారు.
సైబర్ నేరస్థుల బారిన పడిన బాధితులు 24గంటల్లోపు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లోని స్థానిక భాషల్లో వివరాలు తీసుకుని సైబర్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. బ్యాంక్ ఖాతా లావాదేవీల పత్రాన్ని దానికి జతపరచాల్సి ఉంటుంది. నిముషాల వ్యవధిలో ‘మీ ఫిర్యాదు నమోదు చేశాం ఫలానా పోలీస్ ఠాణాకు వెళ్తే ఎఫ్ఐఆర్ చేస్తారంటూ ఈ-మెయిల్, చరవాణికి సంక్షిప్త సందేశం వస్తుంది. బాధితుడు పేర్కొన్న వివరాలను సైబర్ క్రైమ్ పోర్టల్ నిర్వహిస్తున్న కేంద్ర హోంశాఖ అధికారులు ఆయా రాష్ట్రాల పోలీసులకు, జాతీయ, కార్పొరేటు బ్యాంకులకు సమాచారమిస్తారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదులను పరిష్కరించేందుకు పోలీసుశాఖ నుంచి, బ్యాంకుల నుంచి నోడల్ అధికారులుంటారు. పోలీస్ అధికారులు బాధితుల ఫిర్యాదును ధ్రువీకరించిన వెంటనే బ్యాంకుల నోడల్ అధికారులు రంగంలోకి దిగుతారు. సైబర్ నేరస్థులు వినియోగించిన ఖాతా ఏ బ్యాంక్‌లో ఉంటే ఆ బ్యాంక్ ఖాతాలో సొమ్మును స్తంభింపజేసి బాధితుల ఖాతాలోకి తిరిగి జమచేయిస్తారని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
సైబర్‌క్రైమ్ పోర్టల్ నిర్వహిస్తున్న పోలీసులు, బ్యాంకుల నోడల్ అధికారులు సమన్వయంతో గంటల వ్యవధిలోనే సైబర్ నేరస్థుల కదలికలను గుర్తిస్తారు. 1930 సైబర్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ ఏడాది తొలి మూడునెలల్లో 3.52కోట్లు బాధితుల ఖాతాలో జమైంది.
ఇదీ చూడండి: