Girl Dead in Yadadri: యాదగిరిగుట్టలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దైవ దర్శనానికి వచ్చిన 15 ఏళ్ల బొంతల రోజా అనే బాలిక పుణ్యస్నానం చేసేందుకు పుష్కరిణిలో దిగి మృత్యుఒడికి చేరింది. అప్పటి వరకు తనతో కలిసి సంతోషంగా ఉన్న కూతురు మరణాన్ని తల్లి జీర్ణించుకోలేకపోయింది. తన బిడ్డను బతికించండంటూ గుండెలవిసేలా రోదించింది. నీకు బాదం మిల్క్ కొనిస్తా లేమ్మా అంటూ.. బిడ్డ మృతదేహం మీదపడి తల్లి రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. పదిహేనేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకున్న కూతురు.. తన కళ్ల ముందే ఇలా హఠాన్మరణం చెందేసరికి తల్లి షాక్‌కు గురయింది. ఆ తల్లి రోదనలు చూసి చలించిన కొందరు భక్తులు.. 108కు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్నవారు బాలిక చనిపోయినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లిదండ్రులు హైదరాబాద్ గుడి మల్కాపూర్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు.
బాలిక చనిపోయాక మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాల్సి ఉండగా.. ఆ విషయంలో ఆలయ అధికారులు మాత్రం తమ అమానవీయతను ప్రదర్శించారు. బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కన్నతల్లి పట్ల అధికారులు కనికరం చూపలేదు. జాలి, దయ మరిచి వ్యవహరించారు. తల్లిదండ్రులు కూలీపని చేసుకొని జీవించే పేదవారు కావడంతో మృతదేహాన్నితరలించే స్తోమత లేక తల్లి అక్కడే పడిగాపులు కాసింది. సుమారు రెండున్నర గంటలకుపైగా మృతదేహం పక్కనే బిడ్డా.. బిడ్డా.. అంటూ రోదిస్తూ కూర్చుకుంది. ఇదంతా చూస్తూనే ఆలయ అధికారులు, తమకేం పట్టన్నట్లు వ్యవహరించారు. పోలీసులు వివరాలు సేకరించి వెళ్లారే తప్ప మృతదేహం తరలింపునకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు యాదగిరిగుట్ట పురపాలిక చెత్త సేకరణ వాహనంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సర్వత్రా విమర్శలు..: బాలిక మృతిపై ఆలయ అధికారులు వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిడ్డను కోల్పోయి బాధలో ఉన్న వారి పట్ల కనీస బాధ్యతతో వ్యవహరించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క తల్లి ఉన్నా.. అనాథ శవంలా చెత్తబండిలో తరలించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ఇవీ చదవండి: Car accident: అమెరికా వెళ్లాల్సిన యువకుడు.. అనంత లోకాలకు..