Fake Currency Notes: పెద్దపల్లి జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును సుల్తానాబాద్ పోలీసులు ఛేదించారు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుంచి రూ.77,400 విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు సోదాలు నిర్వహించినట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి వెల్లడించారు. నిందితులు చల్లా రాయమల్లు, కొమిరే రాజు, దారంగుల వెంకట్, దగ్యాల అనిల్, పెండం నగేష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు నకిలీ నోట్లు ముద్రిస్తున్న ప్రింటర్, స్కానర్, కట్టర్తో పాటు ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ నోట్లు ముద్రించినా, చలామణి చేసినా చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ సారంగపాణి హెచ్చరించారు. అటువంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు కూడా వెనుకాడమన్నారు. దొంగ నోట్ల ముఠాను పట్టుకున్న సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై ఉపేందర్, ఎస్సై అశోక్ రెడ్డి, ఏఎస్సై తిరుపతి, సిబ్బందిని అభినందించి నగదు రివార్డులను అందజేశారు.
నిఘా వేసి..
గత రెండు మూడు నెలల నుంచి సుల్తానాబాద్ పరిసర ప్రాంతాల్లో దొంగ నోట్లు సరఫరా చేసే వ్యక్తులపై పోలీసు బృందాలు నిఘా పెట్టాయి. ఆ నిఘాలో భాగంగా చెరువుకట్ట ప్రాంతంలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పట్టుకుని ప్రశ్నించగా.. వారిపై ఇంతకు ముందు కూడా దొంగ నోట్ల కేసులు ఉన్నట్లు తేలింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరితో పాటు ప్రింటర్, స్కానర్, కట్టర్లను స్వాధీనం చేసుకున్నాం. -సారంగపాణి, పెద్దపల్లి ఏసీపీ
ఇదీ చదవండి: