ఆగి ఉన్న బస్సును మినీ వ్యాన్ ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం వద్ద జాతీయరహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే స్థానిక కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిందిలా...
కోరుట్ల నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దింపేందుకు వెంకటాపూర్ వద్ద ఆగింది. అదే సమయంలో జగిత్యాల వైపు నుంచి మద్యం సీసాల లోడుతో వస్తున్న ఐసర్ మినీ వ్యాన్ ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ సగభాగం వరకు నుజ్జునుజ్జయింది. మద్యం సీసాలన్నీ చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయాయి. ఆర్టీసీ బస్సు ముందు భాగాన్ని బలంగా ఢీకొనడంతో పగిలిన మద్యం సీసాలు ఎగిరి బస్సు ప్రయాణికులపై పడడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి: Dating Doctor: డేటింగ్ యాప్ ద్వారా డాక్టర్ ఛీటింగ్