కేరింతలు.. దుర్గా నామస్మరణతో పులకరింతలు.. ఊరంతా పండుగ వాతావరణం.. డీజే శబ్దాలతో, హోరెత్తించిన యువత నృత్యాలతో సందడే సందడి.. తొమ్మిది రోజులపాటు పవిత్రంగా పూజించిన అమ్మవారిని పదో రోజు నిమజ్జనం చేసేందుకు ఊరూవాడ కదిలింది. కొన్ని గంటలపాటు పల్లెలోనే శోభాయాత్ర సాగింది. దాదాపు అయిదు గంటల ప్రదర్శన తర్వాత విగ్రహాన్ని ఒక ట్రాక్టర్‌లో ఉంచి, ఇంకో ట్రాక్టర్‌లో పదినుంచి ఇరవై మంది గ్రామస్థులు బయల్దేరారు. అప్పటిదాకా కదం కదిపిన గ్రామస్థులు పొలిమేర దాకా వెళ్లి జాగ్రత్తగా వెళ్లిరమ్మంటూ వెళ్లేవారికి వీడ్కోలు పలికారు. ఇది జరిగిన పది నిమిషాల్లోనే పిడుగులాంటి వార్త(Tragic incident in Khammam) కమలాపురం చేరింది.
కుదిపేసిన విషాదం..
అమ్మవారి వేడుకల్లో అప్పటిదాకా కాలూకాలూ కదిపిన వారు విగత జీవులయ్యారన్న సమాచారం అక్కడివారిని కుదిపేసింది. నిమజ్జనానికి వెళ్తూ శనివారం రాత్రి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అయ్యగారిపల్లి వద్ద నలుగురు మృత్యువాత పడ్డారు. ముదిగొండ మండలం కమలాపురం నుంచి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు మున్నేరు నదికి తరలించారు. ఒక ట్రాక్టర్‌లో విగ్రహం ఉండగా.. మరో ట్రాక్టర్‌లో పది మంది గ్రామస్థులు, యువకులు ఎక్కారు. విగ్రహం ఉన్న ట్రాక్టర్ గంధసిరి మున్నేరు నది వద్దకు వెళ్లింది. వెనుకనున్న మరో ట్రాక్టర్ అటుకాకుండా వల్లభి వైపు వెళ్లింది. ఆ సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
నలుగురు దుర్మరణం
వాహనం వేగానికి తోడు, వర్షం కురుస్తుండటంతో అయ్యగారిపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది. ట్రక్కు కింద పడి గ్రామానికి చెందిన ఉపేందర్(32), ఉమ(40), నాగరాజు(24), స్వామి(50) మరణించారు. ముగ్గురు క్షతగాత్రులను ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డీసీపీ చంద్రబోస్, ఏసీపీలు బసవ రెడ్డి, రామోజీ రమేశ్ , సీఐ సత్యనారాయణ రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బతుకమ్మ కోసం వచ్చి.. తిరిగిరాని లోకాలకు..
ప్రమాదంలో చనిపోయిన ఉమది విషాద గాథ. బతుకమ్మ ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా కొన్ని రోజుల క్రితం స్వస్థలం కమలాపురానికి వచ్చింది ఆమె. భర్త హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఉద్యోగి. శనివారం అమ్మవారి పూజకు అయిదారు కిలోల పూలు సేకరించింది. అమ్మవారి నిమజ్జనానికి వెళ్తూ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఒకరు మృతి.. ఒకరు గల్లంతు
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రఘునాథగూడెంలో శనివారం అర్ధరాత్రి దుర్గామాతను నిమజ్జనం చేస్తుండగా.. కాలువలో పడి ఇద్దరు గల్లంతయ్యారు(Tragedy in DurgaDevi Immersion). అక్కడే ఉన్న స్థానికులు వాళ్లని రక్షించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. అప్పటికే వారు కంటికి కనబడకుండా కొట్టుకుపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలానకిి చేరుకున్న అధికారులు గాలింపు మొదలుపెట్టారు. గల్లంతైన వారిలో కంభంపాటి మధులత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మరొకరు పసుపులేటి శివకోసం సాగర్ కాలువలో గాలిస్తున్నారు.
తొమ్మిదిరోజుల పాటు దుర్గామాతకు(DurgaDevi) భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. హోరెత్తే డీజేపాటల నడుమ అమ్మను గంగమ్మ ఒడికి చేర్చే క్రమంలో విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటనలతో ఖమ్మం జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: husband murdered his wife: కట్టుకున్నవాడే కడతేర్చాడు... కారణం అదేనా..?