హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట హషమాబాద్ ప్రాంతంలో పట్టపగలు రోడ్డుపై కత్తులతో అతి దారుణంగా చంపిన హత్య కేసు(Old City Murder Case)ను చాంద్రాయణగుట్ట పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడ్డ నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2ద్విచక్ర వాహనాలు, 4 చరవాణిలు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
ఈనెల 13న హత్య...
చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి హషమాబాద్ ప్రాంతంలోని రద్దీగా ఉండే రోడ్డుపై ఓ కారును వెంబడించి లోపల ఉన్న హమీద్ బిన్ అలీ జుబేది అనే వ్యక్తిని బయటకు లాగి మారణ ఆయుధాలతో దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. హత్యకు పాల్పడ్డ రయిస్ జాబ్రీ, అదిల్ జాబ్రి, సయీద్ సలేహ్ జాబ్రి, సాద్ బిన్ సలేహ్ జాబ్రిలను అరెస్టు చేశారు.
అసలు కథ ఇది...
ప్రధాన నిందితుడు రయిస్ జాబ్రి మృతుడు హమీద్ బిన్ అలీ జుబేది ఇద్దరు 2019లో దుబాయ్‌లో ఉన్నారు. రయిస్ జాబ్రి ఇండియాకు వస్తున్నప్పడు మృతుడు హమీద్ కొంత లాగేజిని రయిస్ జాబ్రికి ఇచ్చాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన రయిస్ జాబ్రిని కస్టమ్ అధికారులు తనిఖీలు చేయగా.. అందులో కేజీ బంగారం దొరికింది. అక్రమ బంగారం రవాణా కేసు కింద కస్టమ్ అధికారులు రయిస్ జాబ్రిని అరెస్ట్ చేసి పాస్‌పోర్టు జప్తు చేశారు. ఇందుకు మూలకారణం అయిన మృతుడు హమీద్ జుబేది.. రయిస్ జాబ్రి పాస్‌పోర్టు విడిపించి.. ఉద్యోగం కూడా ఇప్పిస్తానని ఒప్పందం చేసుకున్నాడు.
తీవ్ర వాగ్వాదం...
రెండు ఏళ్లయినా ఇప్పటివరకు తన పాస్‌పోర్ట్ ఇప్పించడం లేదని రయిస్ జాబ్రి తన సోదరులతో కలిసి మృతుడు హమీద్ ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పపడ్డాడు. తను దుబాయి వెళ్లాలని.. పాస్‌పోర్టు విడిపించి ఇవ్వాలని మృతుడు హమీద్‌పై రాయిస్ జాబ్రి తీవ్ర ఒత్తిడి చేశాడు.
ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. ఈనెల 13న కారులో వెళ్తున్న హమీద్ జుబేదిని ఆపి రాయిస్ జాబ్రి.. అతని ముగ్గురు సోదరులు హత్యకు పాల్పడ్డారని దక్షిణ మండలం డీసీపీ గజారావు తెలిపారు.
ఇదీ చూడండి: Old City Murder: రోడ్డుపై కారు ఆపి వ్యక్తిని బయటకు లాగి హత్య