Secunderabad Fire Accident accused arrest : రాష్ట్రంలో విషాదం నింపిన సికింద్రాబాద్ రూబీ లాడ్జి అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం తర్వాత పరారీలో ఉన్న నిందితుల కోసం నిన్నటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో రూబీ లాడ్జి, ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంల నిర్వాహకులైన తండ్రీకుమారుడు రాజేందర్ సింగ్, సునీత్ సింగ్, మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్‌వైజర్ ఉన్నారు.
Secunderabad Fire Accident news : నిందితులైన తండ్రీ కుమారుడు ప్రమాదం తర్వాత పరారయ్యారని పోలీసులు తెలిపారు. వీరు కిషన్‌బాగ్‌లోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే అగ్నిప్రమాద ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను పూర్తిగా విచారించిన తర్వాత ఘటనకు గల కారణాలు, లోటుపాట్లు అన్నీ వివరిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
సెల్లార్‌లో ఎటువంటి అనుమతుల్లేకుండా స్కూటర్ల షోరూం నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. ఆ భవనంలో అసలు అగ్నిమాపక నిబంధనలేవీ పాటించలేదని గుర్తించినట్లు వెల్లడించారు. ప్రమాదం నుంచి బయటపడిన మన్మోహన్ ఖన్నా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో 304 పార్ట్ 3, 324 ఐపీసీ అండ్ సెక్షన్ 9 బి ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ 1884 ప్రకారం కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
- సంబంధిత కథనాలు సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. ఎలక్ట్రిక్ వాహనాలే కారణం
- మంటల్లో నుంచి బయటపడలేక పోతున్నాం.. చివరిసారిగా కుటుంబంతో సికింద్రాబాద్ ఘటన మృతులు
- సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. సాహసవీరులారా సెల్యూట్
అసలేం జరిగిందంటే.. రూబీ లాడ్జి ఐదు అంతస్తుల భవనంలో కొనసాగుతోంది. మొదటి అంతస్తులో ఫైనాన్స్ సంస్థ, రిసెప్షన్ విభాగాలున్నాయి. తర్వాతి అంతస్తుల్లోని 25 గదులను అద్దెకు ఇస్తున్నారు. వాహన పార్కింగ్‌కు కేటాయించిన సెల్లార్‌లో విద్యుత్ ద్విచక్రవాహనాల షోరూం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన 25 మంది 1-2 రోజులు ఉండేందుకు ఈ లాడ్జిలో బస చేశారు. సోమవారం రాత్రి 9.17 గంటలకు సెల్లార్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించి.. వాహనాలన్నీ కాలిపోయాయి. వాహనాలు, టైర్లు కాలటంతో దట్టమైన పొగ వ్యాపించింది. రెప్పపాటులో ఐదంతస్తుల్లో ఉన్న గదులను పొగ చుట్టుముట్టి లోపలున్న వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. పొగ ధాటికి తట్టుకోలేక ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.