forest officials attack on podu farmer: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పుట్టల భూపతి గ్రామశివారులో అటవీ శాఖ అధికారులు కొట్టడంతో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో వేంపల్లిపాడు ప్రాంతంలో అటవీ అధికారులు కందకాలు తవ్వుతుండగా... అక్కడికి వెళ్లిన రైతు సోలం బాబును తీవ్రంగా కొట్టారని ఆయన భార్య తెలిపారు. గతంలో గ్రామ పెద్దలు చూపిన హద్దుల వెంట కందకాలు తవ్వుకోవాలని చెప్పినందుకు తమపై దాడి చేశారని ఆరోపించారు.
మంచి నీళ్లు అడిగితే..
హద్దుల వెంట తవ్వుకోమన్నందుకు ఆగ్రహించిన అధికారులు సోలంబాబును గంగారం అటవీశాఖ కార్యాలయానికి తీసుకువెళ్లి కర్రలతో తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. దాహమేస్తుందని తన భర్త మంచి నీళ్లు అడిగితే అధికారులు బాటిల్లో మూత్రం పోసి ఇచ్చి తాగమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామంలో వదిలి వెళ్లిపోయారని బాధితుడి భార్య ఆరోపించారు.
"మా పొలంలో కందకాలు తీయొద్దని చెప్పాం. గ్రామ పెద్దలు చూపించిన సరిహద్దు వెంట తవ్వుకోవాలని చెప్పాం. దీంతో నా భర్తపై కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. అనంతరం కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడా కొట్టారు. బాటిల్లో మూత్రం పోసి తాగమని చెప్పారు. దారుణంగా హింసించారు. మాకు న్యాయం చేయాలి." -సోలం బాబు భార్య
అధికారులపై ఫిర్యాదు
సోలం బాబును చికిత్స కోసం కుటుంబసభ్యులు నర్సంపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్లో అటవీశాఖ అధికారులపై ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: Woman's Suspicious Death : తల్లి చనిపోయిందని తెలియక.. 4 రోజులుగా స్కూలుకెళ్లొస్తూ..