రోజూలాగే అందరూ కలిసి భోజనం చేశారు. అమ్మా నాన్న టీవీ చూస్తుంటే.. పిల్లలంతా ఆడుకున్నారు. సమయం కాగానే నిద్రకు ఉపక్రమించారు. ప్రతిరోజూలాగే మరో కొత్తరోజుకు నాంది పలుకుతామనే ఆశతో.. మరుసటి రోజు తమ జీవితంలో ఏ కొత్తదనాన్ని తీసుకొస్తుందోనన్న ఆలోచనతోనే అంతా నిద్రపోయారు. కానీ.. తిరిగి కళ్లు తెరవలేమని ఊహించలేకపోయారు. గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా పిడుగుపడ్డట్లు వారి మీద పడిన గోడ.. ఆ ఇంట్లో ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది.
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అయిజ మండలం కొత్తపల్లిలో గోడ కూలి ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు మోషా, శాంతమ్మ, చరణ్, రాము, తేజగా గుర్తించారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. వర్షానికే ఇంటి గోడ కూలిందని చెబుతున్నారు.
మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం, మృతులను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వర్షాలు కురిసేటప్పుడు శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండకూడదని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.