మహబూబ్ నగర్ జిల్లా మత్స్య శాఖ పర్యవేక్షణ అధికారి పి.గంగారాం 45 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. అతన్ని అరెస్ట్ చేసిన అధికారులు హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పేర్కొన్నారు.
జిల్లాలోని బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో 24మంది సభ్యులు ఉన్నారు. కొత్తగా మరో 19 మంది సభ్యులను చేర్చుకునేందుకు సంఘం అధ్యక్షుడు శివకుమార్ జిల్లా మత్స్య శాఖ పర్యవేక్షణ అధికారి పి.గంగారాంకు దరఖాస్తు చేసుకున్నాడు. సంఘంలో ఏకగ్రీవ తీర్మానం చేసుకుని.. తహసీల్దార్ నుంచి పొందిన నిరభ్యంతర పత్రాన్ని ఆయనకు సమర్పించాడు. అయితే కొత్త సభ్యులను సంఘంలో చేర్చేందుకు ఒక్కొక్కరికి నాలుగు వేలు చొప్పున 72వేలు ఇవ్వాలని సదరు అధికారి వారిని డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇవ్వలేమని చెప్పగా రూ.45 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ క్రమంలో లంచం ఇవ్వడం ఇష్టం లేని సంఘం నాయకుడు.. ఏసీబీని ఆశ్రయించాడు. జిల్లాలోని మత్స్య శాఖ కార్యాలయంలో బాధితుడి నుంచి బుధవారం రూ. 45 వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అనంతరం నిందితున్ని హైదరాబాద్‌లోని ఏసీబీ స్పెషల్ న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అబలలపై దారుణాలు.. ఒకేరోజు మూడు చోట్ల లైంగిక దాడులు