Fire accident in Chemical Factory: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. శ్రీ మోనాక్షి రసాయన పరిశ్రమలో మంటలు అంటుకొని రసాయనాల డ్రమ్ములు పేలాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... ఏడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రమాదాన్ని గమనించిన కార్మికులు బయటకు పరుగులు తీశారు. రసాయన డ్రమ్ములు పేలి మంటలు వ్యాపించటంతో దట్టమైన పొగలు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం వరకు కనిపించాయి. వేడికి డ్రమ్ములు పేలడంతో రసాయనాలు మురుగు కాలువ గుండా బయటికి వచ్చాయి. ఆర్డినెన్సు ఫ్యాక్టరీ, సదాశివపేట, బోర్పట్ల నుంచి వచ్చిన 7 అగ్నిమాపక శకటాలు సాయంతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భోజన సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది.
పటాన్‌చెరు డీఎస్పీ భీమిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మంటలను అదుపు చేసేందుకు వాటర్ ట్యాంకర్లు కూడా అందుబాటులో ఉంచారు. అయితే ఎవరికీ ప్రమాదం జరగలేదని కార్మికులందరూ బయటే ఉన్నట్లు తోటి కార్మికులు చెబుతున్నారు. భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడం వల్ల పరిశ్రమల చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: ప్రికాషన్ డోసు కాల వ్యవధిపై కేంద్రం క్లారిటీ
ముంచెత్తిన అకాల వర్షాలు.. వడగళ్ల వానతో అతలాకుతలమైన అన్నదాతలు