Fire Accident in Hyderabad: హైదరాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాగ్‌లింగంపల్లి వీఎస్టీ సమీపంలోని గోదాములో అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాం పరిసర ప్రాంతాల్లో బస్తీలు ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Bhag Lingampally Fire Accident : అగ్నిప్రమాద స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. నగరంలో అగ్నిమాపక నియమాలు పాటించని భవనాలు వేల సంఖ్యలో ఉన్నాయని పేర్కొన్నారు. పురాతన గోదాములు, భవనాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చాలాఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన గోదాముల్లో జాగ్రత్తలు తీసుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై గోదాముల నిర్వాహకులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. తగిన ప్రమాణాలు పాటించకపోతే ఉపేక్షించేది లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
మరోవైపు అగ్నిప్రమాద ఘటనాస్థలిని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు వెల్లడించారు. ఈ ఘటన వల్ల యజమానికి దాదాపు కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు చెప్పారు. వ్యాపారపరమైన గోదాములపై ప్రత్యేక నిఘా కొనసాగించనున్నట్లు డీసీపీ వివరించారు. గోదాం యజమానులపై కూడా కేసు నమోదు చేసినట్లు డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.