మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాలానగర్లో అగ్నిప్రమాదం (fire accident) సంభవించింది. గాంధీనగర్ పారిశ్రామికవాడ పంచశీల కాలనీలోని బ్రైట్ లాజిస్టిక్స్ పరిశ్రమలో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి.
దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.
ప్రమాదంలో పరిశ్రమలోని ప్లాస్టిక్ సామగ్రి, అట్టలు పూర్తిగా దహనమయ్యాయి. ఫర్నీచర్ ధ్వంసం అయింది. సుమారు రూ.2 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు పరిశ్రమ యజమాని వెల్లడించారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికుల ఆవేదన..
మరోవైపు ప్రమాదం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలంటూ కోరారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండటం భయాందోళన కలిగిస్తోందంటూ వాపోయారు.
ఇదీ చూడండి: young women died: ఓనర్ కోసం షాప్ ముందు నిలబడితే ప్రాణమే పోయింది