రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మన్నేగూడ వద్ద టైర్ల దుకాణంలో మంటలు చెలరేగాయి. టైర్ల దుకాణం కావడంతో... మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. అక్కడి పరిసరాలు మొత్తం పొగతో కమ్ముకున్నాయి. ఈ ఘటనతో చుట్టు పక్కల ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా టైర్ల దుకాణం సమీపంలోనే ట్రాన్స్ఫార్మర్ ఉంది. దీని వల్ల పెద్ద ప్రమాదం జరగవచ్చని స్థానికులు భయపడ్డారు.
సమాచారం అందుకున్న ఆగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో.. మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దుకాణంలోని సామగ్రి అంతా కాలిపోయింది. షాపు యజమాని ఈ ప్రమాదం వల్ల తనకు భారీ నష్టం వాటిల్లిందని... ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రమాదంతో భారీగా కమ్ముకున్న పొగతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మన్నెగూడ వద్ద సాగర్ హైవేపై ట్రాఫిక్ నిదానంగా సాగింది.