ఏనుబాముల గ్రామానికి చెందిన సురకంటి రామిరెడ్డి(45) తన భార్యా ఇద్దరు పిల్లలతో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో నివాసముంటున్నాడు. రాంరెడ్డి తన కుమారుడు తనూజ్‌రెడ్డి(6)ను తీసుకుని గురువారం ఏనుబాములకు వచ్చాడు. మధ్యాహ్నం వారి వ్యవసాయజక్షేత్రం వద్ద రాంరెడ్డి మృతిచెంది ఉండడాన్ని స్థానికులు గమనించారు. తండ్రి మధుసూదన్ రెడ్డి, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని అతడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తించారు. పక్కనే తాను బలవన్మరణానికి పాల్పడినట్లు రాంరెడ్డి రాసిన లేఖ లభ్యమైంది. ఆ లెటర్‌లో కుమారుడు తనూజ్‌రెడ్డిని పాతబావిలో పడేసినట్లు రాసి ఉంది. బావివద్దకు వెళ్లిన గ్రామస్థులకు బాలుడి చెప్పులు దొరికాయి. 40 అడుగులమేర నీరు ఉండటంతో వారు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. అంతా కలిసి బావిలో గాలించినా మృతదేహం లభించలేదు.
వేదన వెంటాడిందా...
2008 మార్చి 23న నల్గొండలో జరిగిన వివాహానికి వెళ్లి తిరిగి జీపులో వస్తుండగా నకిరేకల్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాంరెడ్డి తల్లి లక్ష్మమ్మ, భార్య శ్రీవిద్య, కుమార్తె అక్షయ దుర్మరణం చెందారు. ఇంట్లో తండ్రి మధుసూదన్ రెడ్డి, రాంరెడ్డి మాత్రమే మిగిలిపోయారు. అనంతరం రాంరెడ్డి, పద్మ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం కలిగారు. తర్వాత వ్యాపారాల్లో నష్టాలు రావడం, ఇంట్లో చిన్నపాటి కలహాలతో ఏడాదిన్నర నుంచి రాంరెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదు. 10 నెలల క్రితం హైదరాబాద్‌లోని రిహాబిలిటేషన్ కేంద్రంలో అతడికి కుటుంబసభ్యులు మానసిక చికిత్స చేయించారు. ' తన ఆత్మహత్యకు తానే కారణమని, చిన్నకుమారుడితో తన భార్య వేగలేదనే బాలుడిని కూడా తీసుకెళుతున్నా' అని లేఖలో రాసి ఉంది.