Prakasham District road accident: ఉన్నత చదువులకు చిన్న కొడుకును అమెరికాకు సాగనంపి తిరిగి వస్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుని తండ్రి, ఆయన పెద్ద కుమారుడు దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లా చిలకలూరుపేట లంబాడీడొంకకు చెందిన చౌడా వెంకట్రావు(55), కళావతి దంపతుల పెద్ద కుమారుడు ప్రసన్న(26) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వర్క్ ఫ్రమ్ హోం కింద ఇంటి వద్దే ఉంటున్నాడు. చిన్న కుమారుడు భాస్కర్‌కు అమెరికాలో చదువుకునే అవకాశం వచ్చింది. అతన్ని విమానంలో సాగనంపేందుకు తల్లిదండ్రులు, సోదరుడు బుధవారం రాత్రి చెన్నైకి వచ్చారు. భాస్కర్ విమానం ఎక్కాక... వీరు కారులో తిరుగు పయనమయ్యారు. గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు జాగర్లమూడివారిపాలెం హైవే వంతెన సమీపంలో... ముందు వెళ్తున్న కట్టెల ట్రాక్టర్‌ను వీరి కారు బలంగా ఢీకొట్టింది. కారు ఒకభాగం ట్రాక్టర్ ట్రక్ కిందికి దూసుకెళ్లడంతో... ఆవైపు కూర్చున్న వెంకట్రావు, ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్, ఆ వెనుక సీటులో ఉన్న కళావతి ప్రాణాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
ఇవీ చదవండి: Two Murders: యాసిడ్ పిచికారీ చేసి.. మారణాయుధాలతో దాడి