Father and Son Suicide Attempt: తమకు సంబంధించిన వ్యవసాయ భూమిని తెరాస నాయకులు కబ్జా చేశారన్న మనస్తాపంతో తండ్రీకొడుకులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. తన 8 ఎకరాల భూమని.. ఆదిలాబాద్ మండలం మావలకి చెందిన తెరాస నాయకుడు ఆఫీజ్ఖాన్ కబ్జాచేశాడని కజ్జర్ల గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం కబ్జా చేసిన భూమికి కంచె కూడా వేశాడని.. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపం చెందిన జైపాల్‌రెడ్డితో పాటు కొడుకు చరణ్ రెడ్డి కూడా.. ఆదివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
తండ్రీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. కొడుకు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నా.. తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలిసి కజ్జర్ల గ్రామస్థులు రిమ్స్‌కు చేరుకుని బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. భాజపా నాయకులు సుహాసినిరెడ్డి ఈ నిరసనకు సంఘీభావం ప్రకటించారు. రెవెన్యూ అధికారుల అండదండలతోనే కబ్జాదారులు పెట్రేగిపోతున్నారని.. కిరాయిగుండాలను తెచ్చి తండ్రీకొడుకులపై దాడి చేయడం వల్లే వాళ్లు ఆత్మహత్య వరకు వెళ్లారని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చూడండి: