Farmers Suicide due to crop loss: ములుగు జిల్లా వెంకటపురం మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గత ఏడాది పండించిన మిర్చి పంటకు దిగుబడి రాక.. అప్పుల బాధ భరించలేక.. అనారోగ్యంతో సతమతమవుతున్న ఓ రైతు సొంత పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల కేంద్రానికి చెందిన పాపారావు గత ఏడాది రెండు ఎకరాల పొలంలో మిర్చి పంట సాగు చేశాడు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు. పెట్టుబడైనా వస్తే బాగుండేది అని ఆశపడ్డాడు. కానీ అది అడియాస గానే మిగిలింది. అకాల వర్షాలు, పంట తెగుళ్లు పాపారావును ఇబ్బందులకు గురిచేశాయి. పంట పెట్టుబడికి చేసిన అప్పులన్నీ అలాగే మిగిలాయి.
ఈ క్రమంలో ఆయన ఆనారోగ్యానికి గురయ్యారు. ఈ ఏడాది మిర్చి పంట ఏద్దామన్న డబ్బులు లేకపోవడం.. ఆరోగ్యం సహరించకపోవడం.. అప్పుల బాధతో మనస్తాపానికి గురయ్యారు. ఇన్ని రోజులు కలియదిరిగిన తన భూమిని తనివి తీరా చూసుకుంటూ.. ఆ నేలలోనే కలిసి పోవాలనుకున్నాడు. తన పొలంలోనే ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలంలో చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా మారిన పాపారావును చూసి అతని కుటుంబీకులు బోరున విలపించారు. ఆయన మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: