గుర్తుంచుకోవడానికి సులువుగా ఉంటుందని.. ఫ్యాన్సీ నంబరు అని ఓ ఆటోడ్రైవర్ 1234ను తన పిన్ నంబర్‌గా పెట్టుకున్నాడు. అదే అతని కొంపముంచింది. కూకట్‌పల్లి ఏవీబీపురంలో నివసించే రాము ట్రాలీ ఆటో నడుపుతుంటాడు. ఈనెల 13న మార్కెట్‌కు వెళ్లినప్పుడు చరవాణి చోరీ కావడంతో కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానంతో తన ఖాతాను తనిఖీ చేశాడు. రూ.1.33 లక్షలు మాయం కావడంతో పోలీసులకు తెలియజేశాడు. ఆటోపై ఉన్న అప్పు తీర్చేందుకు చిట్టీ పాడిన డబ్బును ఎస్‌బీఐ ఖాతాలో వేయగా ఆ సొమ్మంతా స్వాహా చేశారు.
తన చరవాణిలో పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకున్న అతను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేశాడు. అన్నింటికీ యూపీఐ పిన్ 1234 పెట్టాడు. అతని చరవాణి చోరీ చేసిన నిందితుడు 1234 పెట్టి ఉంటాడని ఊహించి ఎంటర్ చేయడంతో సరిపోయింది. వెంటనే జ్యుయలరీ షాపులో బంగారం, డీమార్ట్‌లో షాపింగ్ చేశాడు. బ్యాంకు స్టేట్‌మెంట్‌లో ఈ వివరాలు తెలిశాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డీమార్ట్, జ్యుయలరీ షాపుల్లో సీసీటీవీ ఫుటేజ్ కోసం పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. యూపీఐ పిన్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన చాటిచెప్పింది.
ఇదీ చూడండి: పీఆర్‌సీ కోసం 30వేల మంది ఉద్యోగుల ఎదురుచూపులు