నకిలీ పోలీసు ఇన్‌స్పెక్టర్ అవతారమెత్తిన ఓ వ్యక్తి కటకటాలపాలయ్యాడు. తాను సీఐనంటూ కేసు సెటిల్మెంట్కు 75 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన నకిలీ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ను హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
అసలు ఏం జరిగిందంటే?
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబరు 13లో నివసించే డా.వి.కృష్ణప్రసాద్ స్థానిక ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. రెండేళ్ల కిందట వరంగల్‌కు చెందిన మహేష్‌గౌడ్ ఇతని వద్ద డ్రైవరుగా పనిచేశాడు. వైద్యుడిని నమ్మించి.. ఇంట్లో కృష్ణప్రసాద్, అతడి భార్య సంభాషణలకు చెందిన కొన్ని ఆడియో క్లిప్‌లను సేకరించాడు. ఇది తెలిసిన కృష్ణప్రసాద్ అతడిని విధుల్లో నుంచి తొలగించారు. తర్వాత మహేష్ వైజాగ్ వాసి, ఓ ప్రైవేటు సంస్థలో హెచ్‌ఆర్ విభాగంలో పనిచేసే గౌతం నాయర్ వద్ద ట్రక్కు డ్రైవరుగా చేరాడు. అతడిని నమ్మించి దాదాపు రూ. 15లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించే క్రమంలో డబ్బులు లేకపోవడంతో ఒక పథకానికి తెర తీశాడు. తనకు హైదరాబాద్‌లో తెలిసిన వైద్యుడు ఉన్నాడని, అతడిని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయవచ్చని గౌతం నాయర్‌ను నమ్మించాడు. ఇందుకు తనవద్ద ఉన్న ఆడియో క్లిప్‌లను వాడుకుందామని ప్లాన్ వేశారు. అందుకు గౌతం నాయర్‌ను పోలీసు అధికారి వేషం వేయాలని సూచించాడు.
మాస్టర్ ప్లాన్
ప్లాన్ ప్రకారం.. ఈ నెల 14న నాయర్ నేరుగా వైద్యుడికి ఫోన్ చేసి, తనను ఖమ్మం సీఐ దామోదర్‌గా పరిచయం చేసుకొన్నాడు. ఓ కేసులో మహేష్ గౌడ్ అరెస్ట్ అయ్యాడని, అతన్ని విచారించగా మీ వ్యవహారం బయటపడిందన్నాడు. భార్యను చంపుతానంటూ ఉన్న ఆడియో క్లిప్‌లు లభించాయని బెదిరించాడు. ఈ వ్యవహారం సెటిల్ చేసుకోవడానికి రూ.75లక్షలు ఇవ్వాల్సిందేనన్నాడు. దీంతో కంగారుపడిన వైద్యుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
భక్తుల అవతారంలో..
రూ.20లక్షలు చెల్లిస్తానంటూ వైద్యుడితో పోలీసులు మంగళవారం ఫోన్ చేయించారు. బంజారాహిల్స్‌లోని ఆలయం వద్దకు రావాలని సూచించారు. నాయర్ పోలీసు స్టిక్కరు వేసిన కారులో ఆలయం వద్దకు వచ్చారు. అప్పటికే ఎస్సై కన్నెబోయిన ఉదయ్, సిబ్బంది సుబ్రహ్మణ్యం, సంతోష్ సాధారణ దుస్తుల్లో భక్తుల్లా నటిస్తూ మాటువేశారు. వైద్యుడితో మాట్లాడుతుండగా పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు మహేష్‌గౌడ్ అక్కడి నుంచి పరారయ్యాడు. చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఏసీపీ సుదర్శన్, ఇన్‌స్పెక్టర్ శివచంద్ర అభినందించారు.
ఇవీ చూడండి: