Fake CBI Agents Arrest: సీబీఐ అధికారులమంటూ గచ్చిబౌలిలో జయభేరి ఆరెంజ్ కౌంటిలో బంగారం ఎత్తుకెళ్లిన ముఠా పట్టుబడింది. నిందితులను ఏపీలోని రాజేంద్రవరంలో.. సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 1.2 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు నిందితులను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఈనెల 13న గచ్చిబౌలిలో జయభేరి ఆరెంజ్ కౌంటిలోని సి-బ్లాక్‌లోని అపార్టుమెంట్‌లోని స్థిరాస్తి వ్యాపారి వెంకటసుబ్రహ్మణ్యం ఇంట్లోకి ఆగంతకులు ప్రవేశించారు. సీబీఐ అధికారులమంటూ అక్కడున్నవారికి చెప్పారు. అనంతరం ఇల్లంతా సోదాలు చేయాలంటూ నిందితులు హడావుడి చేసి.. బంగారం, నగదుతో ఉడాయించారు.
Gachibowli Fake Rides: బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఈరోజు ఉదయం రాజమహేంద్రవరంలో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌లో ఐదుగురిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
కాజేసినా.. కేసు పెట్టడని..
ప్లాన్ చేసింది స్థిరాస్తి వ్యాపారి వద్ద పనిచేస్తున్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కీలక నిందితుడు జశ్వంత్ కొన్నేళ్లుగా సుబ్రహ్మణ్యం వద్ద పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు సందీప్‌తో కలిసి ఈ ప్లాన్ వేశాడు. తన యజమాని వద్ద చాలా బ్లాక్ మనీ ఉందని.. డబ్బు దొంగతనం చేసినా.. పోలీసులకు ఫిర్యాదు చేయలేడని ఊహించి.. ఈ చర్యకు పాల్పడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం ఎనిమిది మంది ప్లాన్ వేసుకుని.. ట్రావెల్స్ కారు మాట్లాడుకుని.. దాని ప్లేట్ మార్చి.. నకిలీ ఐడీ కార్డులు సృష్టించి.. సీబీఐ అధికారులుగా ఇంటికి వెళ్లారని తెలిపారు.
నిందితులు రెండు నెలల నుంచి దీని కోసం ప్లాన్ వేశారు. త్వరలోని పరారీలో ఉన్న మిగతా నిందితులను పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Fake Raids: సీబీఐ అధికారులమంటూ మోసం.. 1,340 గ్రాముల బంగారం, డబ్బు స్వాహా!