Excise Police Attack on Tribal Lady: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం లంబాడి తండా గ్రామానికి చెందిన గిరిజన యువతిపై చెన్నూరు ఆబ్కారీ శాఖ అధికారులు దాడి చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గుడుంబా తయారీ కేంద్రాలపై దాడి చేయడానికి నిన్న ఉదయం అధికారులు వెళ్లారు. ఒక గిరిజన మహిళ ఇంట్లో సోదాలు చేస్తుండగా.. మహిళకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సదరు మహిళను లాఠీతో కొట్టగా తీవ్ర గాయాలయ్యాయి.
సోదాల పేరుతో ఇంట్లో చొరబడి అసభ్యకరంగా మాట్లాడుతూ... మెడలో ఉన్న నగలను లాగి దాడి చేశారని బాధిత మహిళ ధరావత్ రుక్మిణీ చెప్పారు. మహిళా పోలీసులతో పాటు పురుష పోలీసులు ఇష్టారీతిన దాడి చేశారని ఆమె ఆవేదన చెందారు. ఈ విషయంపై ఆబ్కారి శాఖ సీఐ హరిని చరవాణిలో వివరణ కోరగా.. తాము దాడి చేయలేదన్నారు. ఆ మహిళ ఇంట్లో 80 లీటర్ల గుడుంబా.. స్వాధీనం చేసుకొని స్థానిక ఎస్సై ముందు బైండోవర్ చేసి తిరిగి తండాలోని ఆమె అత్తగారి ఇంట్లో అప్పగించి వచ్చినట్లు చెప్పారు. మండలంలోని లంబాడితండా గ్రామానికి చెందిన రుక్మిణిపై ఆబ్కారీ పోలీసులు దాడి చేసిన విషయంలో ఆబ్కారీ సీఐ హరితో పాటు ఎస్సై మరికొంత మంది సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
ఇవీ చదవండి: