ED Raids in Hyderabad Today : క్యాసినోలు నిర్వహిస్తూ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐఎస్ సదన్‌కు చెందిన ప్రవీణ్, బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న మాధవ రెడ్డితో పాటు పలువురు ఏజెంట్ల ఇళ్లల్లో ఈడీ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. 8 బృందాలుగా ఏర్పడిన అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.
ED raids in sri lanka casino agents : పలు పత్రాలతో పాటు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ , చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. శ్రీలంకకు చెందిన క్యాసినో సంస్ధలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న ప్రవీణ్, మాధవ రెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురిని క్యాసినో ఆడేందుకు తీసుకెళ్తున్నారు. గత కొన్ని నెలలుగా శ్రీలంకలో సంక్షోభం నెలకొనడంతో.. క్యాసినో నిర్వహించే పరిస్థితి లేదు.
రూట్ మార్చిన శ్రీలంక క్యాసినోలు నేపాల్‌తో పాటు భారత్ సరిహద్దుల్లోనూ క్యాసినో నిర్వహిస్తున్నాయి. జూన్ 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన క్యాసినోకు హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూర్ నుంచి చాలా మందిని ప్రవీణ్, మాధవ రెడ్డి తీసుకెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేపాల్‌కు వెళ్లి అక్కడ క్యాసినో ఆడించారు. ఒక్కొక్కరి నుంచి దాదాపు 3లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు.
ఈ డబ్బంతా కూడా శ్రీలంక క్యాసినో సంస్థలకు మళ్లించి అక్కడి నుంచి కమీషన్ తీసుకున్నట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి క్యాసినో నిర్వహించినట్లు తేల్చారు. ఈ మేరకు తగిన ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రవీణ్‌పై గతంలోనూ కేసున్నట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.