Document Fraud Detection in Banking: నకిలీ పత్రాలతో బ్యాంకుతోపాటు కంపెనీలను మోసం చేసిన కేసులో వ్యాపార సంస్థ డైరెక్టర్‌ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ(ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్) పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సనత్‌నగర్‌కు చెందిన వ్యాపారి కె.సంతోష్‌రెడ్డి(36) కంపాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రై. లిమిటెడ్ డైరెక్టర్. సివిల్ కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే 8 సంస్థలవారు సామగ్రి సరఫరా చేసేలా అవసరమైన బ్యాంకు గ్యారంటీ అందజేశాడు.
నిబంధనల ప్రకారం అతడికి బ్యాంకు గ్యారంటీ రూ.15కోట్లు మాత్రమే ఉంది. అంతకు మించి క్రెడిట్ లిమిట్ పొందేలా ఫోర్జరీ సంతకాలతో నకిలీ బ్యాంకు గ్యారంటీ పత్రాలను ఆయా కంపెనీలకు అందజేశాడు. వారి నుంచి సామగ్రి సరఫరా చేయించుకున్నాడు. ఆ సంస్థలు ఇచ్చినట్టుగా ఫోర్జరీ పత్రాలను సృష్టించాడు. వాటితో యూబీఐ నుంచి రూ.53,18,50,093కు క్రెడిట్ స్థాయి పెంచుకున్నాడు. బ్యాంకు పరిశీలనతో మోసం వెలుగు చూడటంతో ఈ ఏడాది జులైలో బ్యాంకు ఏజీఎం ప్రకాశ్‌బాబు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ నేర విభాగ డీసీపీ రోహిణి ప్రియదర్శిని సారథ్యంలో ఇఓడబ్ల్యూ డీసీపీ కవిత దార, ఏసీపీ గంగారెడ్డి, ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ సీతారామ్, శివానంద్, నవీన్, నరేష్, అనిల్ బృందం దర్యాప్తు చేపట్టింది. నిందితుడు విదేశాలకు పారిపోయేందుకు సిద్ధమైనట్టు గుర్తించారు. అతడి కదలికలపై నిఘా ఉంచి జూబ్లీహిల్స్‌లోని భవనంలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో నెక్కంటి శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేశారు. పరారీలో ఉన్న నిందితులు కె.గోపాల్, ఎస్.సురేందర్‌రెడ్డిను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి: IPS Transfers in Telangana: రాష్ట్రంలో పెద్దఎత్తున ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్