తనకు వివాహం అయిన విషయం దాచిపెట్టి ఓ యువతిని పెళ్లాడుతానంటూ మాయామాటలు చెప్పి మోసానికి యత్నించిన ఓ వైద్యుడిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏపీ గుంటూరు జిల్లా బ్రాడిపేటకు చెందిన గబ్బిట అభిరాం చంద్ర... గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో న్యూరో సర్జన్‌గా పని చేస్తున్నాడు.
నిజాంపేట రోడ్లో నివసించే ఓ యువతి... ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తోంది. సెప్టెంబర్ 2020లో ఆ యువతి బంబుల్ అనే డేటింగ్ యాప్ (Dating App)లో తన వివరాలు అప్లోడ్ చేసింది. తరువాత రోజే అభిరాం చంద్ర ఆ యాప్ ద్వారా ఆ యువతికి పరిచయమయ్యాడు. తనకు వివాహాం అయిన విషయాన్ని దాచిపెట్టి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.
యువతితో పరిచయం పెంచుకున్న అతడు... ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. వివాహం చేసుకుందామన్న ప్రతీసారి... ప్రతిపాదనను దాటి వేసేవాడు. అభిరాం గురించి వివరాలు సేకరించిన ఆ యువతికి, అభిరాం చంద్రకు ముందే వివాహం జరిగింది అనే విషయం తెలిసింది. తనను అభిరాం చంద్ర మోసగించేందుకు యత్నించాడని గుర్తించిన బాధితురాలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. డేటింగ్ యాప్‌లు వాడి ముక్కుముఖం తెలియని వాళ్లతో పరిచయాలు పెంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: Green Channel: గ్రేట్ పోలీస్... గ్రీన్‌ఛానల్ సక్సెస్