ఖమ్మం జిల్లాలో ఓ రెవెన్యూ ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కినందుకుగానూ స్థానికులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు. సదరు రెవెన్యూ అధికారి చేష్టలకు ప్రజలు, రైతులు ఎంతగా విసిగి వేసారి పోయారో తెలుసుకునేందుకు ఈ ఒక్క ఘటన చాలు. ఖమ్మం జిల్లా వేంసూరు డిప్యూటీ తహసీల్దార్‌గా ఉపేందర్ బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాలేదు. కానీ ఈయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒకటీ రెండుసార్లు కొంతమంది ఏసీబీని సైతం ఆశ్రయించి చివరకు ధైర్యం సరిపోక వెనకడుగు వేశారు. కానీ చివరకు ఓ రైతు ఈ డిప్యూటీ తహసీల్దార్ అవినీతి బండారం బయటపెట్టించాడు.
2 లక్షలు డిమాండ్
సత్తుపల్లికి చెందిన రైతు తోట సాంబశివరావు, అతని కుటుంబసభ్యుల పేరు మీద వేంసూరు మండలంలో 25 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి సర్వే చేసి సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్‌ను కోరగా... 2 లక్షలు డిమాండ్ చేశాడు. లక్ష రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. లంచం వ్యవహారంపై ఏసీబీ అధికారుల్ని రైతు ఆశ్రయించగా వలపన్ని అవినీతి అధికారి బండారం బయటపెట్టారు.
వెలుగులోకి అక్రమ సంపాదన
ఏసీబీ అధికారులకు చిక్కిన అవినీతి అధికారి... అక్రమ సంపాదన వెలుగులోకి వస్తోంది. ఉపేందర్‌ను వేంసూరు నుంచి ఖమ్మం తీసుకొచ్చిన అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. మమతా రోడ్డులోని ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటున్న అధికారి ఇంట్లో సుదీర్ఘంగా సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి వరకు 37 లక్షలకు పైగా నగదు, 30 తులాల బంగారం, పలు ఆస్తులకు సంబంధించిన విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: రూ.11.63 కోట్ల విలువైన బంగారం బిస్కట్లు స్వాధీనం