Rachakonda she teams Decoy Operations: హైదరాబాద్ మహానగరంలో వందలాది స్కానింగ్ కేంద్రాలు.. వాటిలోని కొన్ని కేంద్రాల్లో గుట్టుగా సాగించే అక్రమ కార్యకలాపాలు. వాటి ఫలితం.. తల్లి కడుపులో నుంచి బయటకు రాకముందే నెత్తుటిముద్దవుతున్న ఆడబిడ్డలు. వరుస కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టడం, ఆర్థిక స్తోమత లేకపోవడం కారణాలైతే.. కేవలం మగపిల్లలే కావాలని గర్భిణీ కుటుంబీకులు ఆశించడం.. ఈ భ్రూణహత్యలకు దారితీస్తున్నాయి. దీనికి తోడు ఈ చర్యలను ఖండించాల్సిన డాక్టర్లు సైతం కాసులపై దురాశతో ఈ అక్రమాలకు పాల్పడటం.. ఆడశిశువుల నిండు జీవితాలను కాలరాస్తున్నాయి. అదెలా అంటే రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లోని పల్లెలకు కొన్ని ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు కలిసి మొబైల్ స్కానింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. కొందరు ఆర్‌ఎంపీ/పీఎంపీల సహకారంతో గ్రామాల్లోనే లింగనిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్లను వద్దనుకునే వారిని హైదరాబాద్ తీసుకొచ్చి అబార్షన్లు చేయిస్తున్నారు.
ఆట కట్టిస్తున్నారు
she teams Decoy Operations: ఇటువంటి ఆగడాలకు పాల్పడుతున్న వైద్యులు, స్కానింగ్ కేంద్రాల గుట్టురట్టు చేసి.. జైలు ఊచలు లెక్కపెట్టించేందుకు రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని షీటీమ్స్ సాహసోపేతంగా డెకాయి ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. పక్కా ఆధారాలతో తప్పుచేసిన వారిని న్యాయస్థానం ఎదుట నిలబెడుతున్నాయి. అడుగడుగునా.. అడ్డంకులు ఎదురైనా.. కడుపులోఉన్న శిశువుకు ప్రమాదమని తెలిసినా.. గర్భం ధరించిన కానిస్టేబుల్స్, పోలీసు అధికారులు, సిబ్బంది, బంధువులు ధైర్యంగా డెకాయ్ ఆపరేషన్స్‌లో ముందుకు వస్తున్నారు. కాబోయే తల్లిగా.. రేపటి సమాజానికి అవసరమైన ఆడపిల్లలను కాపాడేందుకు చొరవ చూపుతున్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో 11−12 డెకాయి ఆపరేషన్స్ ద్వారా వైద్యులను అరెస్టు చేశారు. షీ టీమ్స్ ఇన్‌ఛార్జి షేక్ సలీమా.. తన బృందంతో కలిసి పకడ్బందీగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వారి కృషిని సీపీ మహేశ్ భగవత్ ప్రశంసించారు.
డెకాయ్ ఆపరేషన్ ఇలా
పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న ఆరు నెలల ఓ గర్భిణీ. జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక రోజు ఉప్పల్ సమీపంలోని స్కానింగ్ కేంద్రంలో లింగనిర్ధరణ పరీక్షలు చేస్తున్నట్లు గుర్తించారు. అక్కడి వైద్యురాలు అబార్షన్లు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఎలాగైనా ఆస్పత్రి యాజమాన్యానికి బుద్ధి చెప్పాలనుకున్నారు. ప్రభుత్వ వైద్యాధికారి, కానిస్టేబుల్, సహాయకుడు.. ముగ్గురూ కలసి ఆ ఆస్పత్రికి వెళ్లారు. కడుపులో ఉన్న బిడ్డ సరైన దిశలో లేకపోవటంతో.. 15 సార్లు స్కానింగ్ తీయాల్సి వచ్చింది. చివరకు లింగనిర్ధరణ పరీక్ష చేసిన వైద్యురాలు.. పుట్టబోయేది ఎవరనేది తేల్చారు. అప్పటివరకూ శరీరాన్ని మెలిపెడుతున్నా నొప్పులను పంటిబిగువున భరించారు. పరీక్ష అనంతరం పక్కా ఆధారాలతో ఆ వైద్యురాలిని అరెస్ట్ చేశారు. రాచకొండ షీటీమ్స్ చేపట్టిన డెకాయ్ ఆపరేషన్స్‌లో ఇదొక ఉదాహరణ మాత్రమే.
రిస్క్‌తో కూడుకున్నది
చౌటుప్పల్, ఉప్పల్, మేడిపల్లి, చైతన్యపురి, ఇబ్రహీంపట్నం వంటి చోట్ల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ ఈ డెకాయ్ ఆపరేషన్స్ ద్వారా సుమారు 11 మంది వైద్యులను షీ టీమ్స్ అరెస్ట్ చేసింది. రెండు ఆస్పత్రులను సీజ్ చేయించింది. తేలికగా అనిపించేలా ఉన్నా.. డెకాయ్ ఆపరేషన్‌కు ముందు పోలీసులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా వేషం మార్చి.. ఆస్పత్రిలో సిబ్బంది, వైద్యులకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. ఒకవేళ ఆస్పత్రి నిర్వాహకులు ఎదురుదాడికి దిగితే తట్టుకునేందుకు సిద్ధమై ఉంటారు. వీటన్నింటినీ మించి డెకాయ్ ఆపరేషన్‌లో పాల్గొనే గర్భిణులు ఎంతో ధైర్యం చేసి ముందుకు రావటం గొప్ప విషయమంటారు షీటీమ్స్ డీసీపీ సలీమా.
ఇదీ చదవండి: మానవత్వం మరచిన తల్లి.. దివ్యాంగుడైన కుమారుడిని..!